చిరకాల మిత్రుని రాక.... అన్నీ కీలకమే...!

Podili Ravindranath
భారతదేశానికి అత్యంత ఆప్తులు, శ్రేయోభిలాషి, చిరకాల మిత్రదేశం ఏదీ అంటే అంతా ఠక్కున చెప్పే సమాధానం రష్యా. విద్యా, వ్యాపార రంగాల్లో మొదటి నుంచి భారత్‌కు అండగా నిలుస్తోంది రష్యా. ఇక రక్షణ రంగంలో అయితే రష్యా చేస్తున్న సాయం అంతా ఇంత కాదు. ఇప్పుడు మరోసారి ఈ రెండు దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఈ రోజు భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. చిరకాల మిత్ర దేశం రష్యాతో మరిన్ని కీలక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ రెడీ అవుతోంది. మోదీ - పుతిన్ భేటీ.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడేందుకు సాయం చేస్తుందని అధికార వర్షాలు భావిస్తున్నాయి. భారత్ పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రధాని మోదీతో పుతిన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య దాదాపు పది కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రక్షణ, వాణిజ్య రంగాలతో పాటు పర్యావరణ మార్పుల అంశాలు కూడా ఉన్నట్లు సమాచారం.
పుతిన్ పర్యటనలో ఇరు దేశాల రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల మంత్రులు కూడా ముఖాముఖి సమావేశం కానున్నారు. భారత్‌ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను మరింత వేగంగా అందించాలని రష్యాను భారత్ కోరనుంది. అదే సమయంలో రక్షణ రంగంలో పెట్టుబడులలతో పాటు ఆయుధాల కొనుగోలు విషయంపై కూడా ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో చిరకాల సంబంధాలు ఉన్నాయి. ఈ భేటీలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీ సమీపంలోని కోర్వాలో దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో రెండు దేశాలు కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో 5 లక్షల ఏకే - 230 రైఫిళ్ల తయారీకి కూడా ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చేసింది. ఇక సైన్యం కోసం రెండు ఇంజిన్లు 226 - టీ హెలికాఫ్టర్లను సంయుక్తంగా తయారు చేయాలని కూడా ఇప్పటికే రెండు దేశాల అధికారులు నిర్ణయించారు. మోదీతో భేటీ అనంతరం... రాత్రి 9 గంటల 30 నిమిషాలకు రష్యాకు పుతిని తిరుగు పయనమవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: