భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఓమిక్రాన్...!

Podili Ravindranath
ఓమిక్రాన్ వేరియంట్ వైరస్.... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా భారత్‌లో ప్రవేశించింది. వచ్చిన తర్వాత ఇప్పుడు వైరస్ ఏ మాత్రం ఆగటం లేదు. రెండు రోజుల్లోనే ఏకంగా రెండు పదుల కేసులు భారత్‌లో నమోదయ్యాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న కారణంగా ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు కూడా తమ పూర్వ స్థితికి చేరుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా కుదురుకుంటోంది. ఇదే సమయంలో ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసింది ఓమిక్రాన్ వేరియంట్ వైరస్. ఇది ఇప్పటికే దాదాపు అన్ని దేశాలకు చేరుకుంది. ఇప్పటి వరకున్న వచ్చిన వాటి కంటే కూడా ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వ్యాక్సిన రెండు డోసులు తీసుకున్న వారికే వైరస్ పాజిటివ్ రావడం ఇప్పుడు మరింత కలవరపెడుతోంది. భారత్‌లో తొలుత కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో రెండు పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత గుజరాత్, మహారాష్ట్రలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.
ఐదు రోజుల్లోనే ఇప్పుడు ఏకంగా 20కి పైగా కేసులు భారత్‌లో నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే కొత్తగా ఏడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఏకంగా 9 మందికి ఓమిక్రాన్ వైరస్ సోకింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఓమిక్రాన్ కేసుల సంస్థ 21కి చేరుకుంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌ నగరంలోని ఆదర్ష్‌నగర్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 9 మందికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు రాజస్థాన్ ప్రభుత్వ వైద్య అధికారులు వెల్లడించారు. వీరందరూ కూడా ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు తెలిసింది. కర్ణాటకలో 2, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. ఆదివారం ఒక్కరోజే దేశంలో మొత్తం 16 ఓమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు ఓమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఒక్కరు తప్ప.. మిగిలిన వారంతా కూడా విదేశాల నుంచి వచ్చిన వారే అని కేంద్రం వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: