రోశయ్య : తెలివైన కోమటి..ఎడతెగని వాగ్ధాటి!

RATNA KISHORE

మా ఉద్దానం నేలలతో ఆయనకు అనుబంధం ఉంది
ఇక్కడే కొద్ది రోజులు ఆయన గడిపారు కూడా!
అదేవిధంగా మా ప్రాంతం వెనుకబాటుపై ఆయనకు అవగాహన ఉంది
మంచి వ్యక్తి, మా ప్రాంత నేతలను గౌరవించిన మంచి మనిషి
ఆ విధంగా ధర్మాన కానీ బొత్స కానీ ఆయనకు చేరువ.
పేరుకు గుంటూరు స్వస్థలం అయినా అన్ని ప్రాంతాలపైనా ప్రేమ ఉంది అనేందుకు
ఆర్థిక మంత్రి హోదాలో చేసిన కేటాయింపులే తార్కాణం. వైఎస్ ను వారించినా కూడా
కొన్ని మంచి పనులకు మాత్రం నిధులు సమకూర్చి భేషజాలు లేని రుజువర్తనలో ఉన్న
రాజకీయం ఒకటి నడిపారు ఈ పెద్దాయన.

మాజీ ముఖ్యమంత్రి అని రాయడం కన్నా మాజీ గవర్నర్ అని రాయడం కన్నా నిబద్ధత ఉన్న కాంగ్రెస్ కార్యకర్త అని ఆయన గురించి రాయడమే గొప్ప విషయం. అదే అర్హతకు తూగే విషయం. రోశయ్య నిబద్ధతకూ క్రమశిక్షణకూ మారుపేరు. తెలివైన కోమటి. సమర్థుడయిన ఆర్థిక మంత్రి. ఆర్థిక వేత్త అని కూడా రాయొచ్చు కానీ ఇంకాస్త ఆయనకు పరిణితి ఉంటే ఆ  పదం కూడా ఆయనదే కావొచ్చు. అయినా కూడా వైఎస్ చెప్పినవన్నీ ఆయన చేయడానికి ఎంతో ఓర్పు వహించారు. నిధుల సర్దుబాటుకు ఎన్నో దారులు వెతికారు. అయినా కూడా తన సోదరుడు చెప్పిన మాటకు ఏనాడూ ఎదురు చెప్పలేదు. వయసు రీత్యా ఆయన చాలా పెద్దవారు. వారిని గౌరవించడం మన బాధ్యత అని మాత్రమే అన్నారు వైఎస్. ఆ విషయమై రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఇవాళ్టికీ అదే గౌరవం రోశయ్య విషయమై ఉంది.

  శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుపై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది. ఈ ప్రాంతం సాగునీటి వనరుల వినియోగంపై, ప్రాజెక్టుల నిర్వహణపై ఆయనకు మంచి అభిప్రాయం ఉంది. శ్రీకాకుళానికి ఏదయినా చేద్దాం అంటే రోశయ్య కాదనలేదు. అలా తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల ఆధునికీకరణకు సంబంధించి నిధులు కేటాయింపులో ఆయనదే పై చేయి. ఆర్థిక మంంత్రి హోదాలో 139కోట్ల రూపాయలు కేటాయించడమే కాక సంబంధిత పనులకు నవగాం సంత వద్ద శంకు స్థాపన చేసింది కూడా ఆయనే! ఇదే కాదు ఈ ప్రాంతానికి ఏ సాయం కావాలన్నా అప్పటి మంత్రి ధర్మాన అడిగిందే తడవుగా చేసి పంపారు. ఓ విధంగా చెప్పాలంటే ధర్మానను గౌరవించారు. ఉత్తరాంధ్రకు చేరువయ్యారు.


నిన్నటి వేళ మాజీ మంత్రి ధర్మాన చెప్పిన విధంగా ఆయన కు ఓడీకి వెళ్లడం అంటే ఇష్టం ఉండదు. ఆర్బీఐ దగ్గర ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పి ఓవర్ డ్రాఫ్టు పేరిట సొమ్ములు తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న నేత. అంతో ఇంతో ఇప్పటి ఆర్థిక మంత్రుల కన్నా  భాషను స్పష్టమయిన రీతిలో పలకడమే కాకుండా తెలుగు దనం నిండిన మనిషిగా ఆయనకు పేరు. ఆయనను చూసి తెలుగు రాష్ట్రాల మంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో!ముఖ్యంగా హాస్య చతురత ఉన్న వ్యక్తి. వైఎస్ ఒక్కరికే  కాదు ఆయనంటే అందరికీ  ఇష్టమే! ఓ విధంగా పెద్దాయన అందరివాడే అని రాసుకోవచ్చు. ఆయన జీవితం కడదాకా ఎవ్వరిపైనా నిందలు వేయలేదు. పదవులపై పెద్దగా ప్రేమ చూపిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ తరహా రాజకీయాలు తెలిసిన వ్యక్తి అయినప్పటికీ చాలా సార్లు నవ్వుకుని ఊరుకున్న వ్యక్తిత్వం ఆయనకే సొంతం.
- రత్నకిశోర్ శంభుమహంతి
ఫొటో : డీసీసీబీ మాజీ చైర్మన్ నర్తు నరేంద్ర యాదవ్ సర్ fb వాల్ నుంచి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: