రోశయ్య : పెద్దాయనకు సెండాఫ్..!

RATNA KISHORE
పంచెకట్టు పెద్దాయన
తిరుగులేని పెద్దాయన
ఇక మన మధ్య లేరు అని చెప్పుకోవడంలో
బాధ ఉంది కానీ అంతకుమించి బాధ్యత కూడా ఉంది
మన నాయకులు ఆయనను చూసి నేర్చుకోవాలి
నేర్చుకుంటారో లేదో కానీ కనీసం ఇప్పటి నుంచి అయినా
ఆర్థిక క్రమశిక్షణ ఒకటి అలవర్చుకోవాలి

కొణిజేటి రోశయ్య అనే పెద్దాయన నిన్న మన నుంచి వెళ్లిపోయారు. బాధాకరం. అతి ఆడంబరం లేని వ్యక్తులు జీవిత కాలంలో తమ పని తాము చేసుకుని పోయే తత్వానికి చాలా దగ్గర. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రాలో రోశయ్య మాటే కాదు నవ్వు కూడా  ప్రత్యేకం. విపక్షంపై సెటైర్లు వేయడంలో ఆయన దిట్ట! స్పష్టమయిన తెలుగు మాట్లాడుతూ, ఉన్నది ఉన్నట్లు మాట్లాడి సభికులను ఆకట్టుకోవడమే ఆయన శైలి. పేరుకే గుంటూరు పెద్దాయన కానీ మనసంతా అన్ని ప్రాంతాలపైనే! పెద్దగా ఆర్థిక నేరాలు చేయని వ్యక్తి. కొన్ని సార్లు సొంత వాళ్లపైన కూడా చలోక్తులు వేసిన వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి కి సోదర తుల్యుడు.అసలు ఆయన పద్దు పెట్టే విధానం, అమలు చేసే విధానం రెండూ ప్రత్యేకమే. ఆర్థిక మంత్రులు యనమల కానీ బుగ్గన రాజేంద్ర కానీ వీళ్లంతా ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవాలి. ప్రణాళిక బద్ధంగా రూపాయి ఖర్చుపెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ఉచిత పథకాలు వద్దన్న సందర్భాలూ ఉన్నాయనే అనుకోవాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి హామీలు విని భయపడిన మొదటి వ్యక్తి ఈయనే! డబ్బులు ఎలా వస్తాయి అని రాజశేఖర్ రెడ్డిని ఎన్నో సార్లు ప్రశ్నిస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటే దేవుడే ఇస్తాడు అని అనేవారు వైఎస్సార్. ఏదేమయినప్పటికీ ఆయనకు ఉచితాలు నచ్చవు. దుబారా నచ్చదు. అప్పు ఇష్టం ఉండదు. ఓవర్ డ్రాఫ్ట్ వద్దనే అంటారు. ఓ కామర్స్ విద్యార్థి ఇంతకుమించి ఏం ఆలోచిస్తారని? ఆయనకు రాష్ట్ర ఆర్థిక స్థితీ గతీ తెలుసు. లక్ష కోట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టినా కూడా ఒకటికి వందసార్లు వాటి వివరాలు సరిపోల్చి మాట్లాడే ధీశాలి. విషయ నిపుణుడు ఆయనే!
ఇంకా చెప్పాలంటే...
రాజకీయం ఎలా ఉన్నా, రాజకీయంలో ఉన్నతి, పతనం ఎలా ఉన్నా కూడా ఎవరి జీవితం వారిదే! రాజకీయంలో కొన్ని మలుపు లు, కొన్ని మెరుపులు, కొన్ని మరకలు సాధారణం. సామాన్య జీవితం నుంచి ఎదిగివచ్చినా, లేదా గొప్ప కుటుంబాల వారసత్వాన్ని అందుకున్నా కూడా ఇవన్నీ సర్వ సాధారణం. రోశయ్య అతి నిరాడంబర నేత. ఎవ్వరినీ నొప్పించని నేత. అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం. కాంగ్రెస్ రాజకీయాలు అంటేనే విభిన్నంగా ఉండే సమయంలోనే ఆయన రాణించారు. శాసన మండలి నుంచి శాసన సభ వరకూ రాణించారు. ఆర్థిక మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు.


దుబారా అంటే ఇష్టపడని వ్యక్తి. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా ఆయన శైలి చలోక్తులు ఉండాల్సిందే! ఇంకా చెప్పాలంటే సెషన్ నిర్వహణపై మంచి పట్టున్న నేత. శాసన సభ వ్యవహారాలు నిర్వహించడంలో రూల్స్ మాట్లాడడంలోనూ పాటించడంలోనూ రెంటిలోనూ తనకు తానే సాటి. నిబద్ధత ఎంతో ఉన్న నేత. మన నాయకులు అప్పులు చేసి రాష్ట్రాలను నడిపిస్తున్న నాయకులు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో! ముఖ్యంగా వైఎస్సార్ ఆయనను గౌరవించిన రీతి ఒకటి ఎప్పటికీ ఓ మంచి జ్ఞాపకమే. ఇవాళ రేపు ఒకరినొకరు ఎంత అసహ్యంగా తిట్టుకుంటున్నారో తిట్టుకుంటారో చూడగలం మనం.. కానీ ఆయన వీటికి అతీతంగానే నడుచుకుని వ్యవహార దక్షతను పెంచుకుని రాజకీయాలు నడిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: