మెరుగైన సమాజ నిర్మాణంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయా..!

MOHAN BABU
 ఉన్నత ఆశయంతో గమ్యాన్ని నిర్ణయించు కున్నప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి సుదూర ప్రయాణం చేయడమే కాకుండా ఆటంకాలు ఎదురుదెబ్బలు ఆరోహణ అవరోహణలు  అధిగమించాల్సి ఉంటుంది. ఈ సిద్ధాంతం వ్యక్తికి, వ్యవస్థకు, మెరుగైన సమాజ నిర్మాణము కోరుతున్న దేశానికి కూడా వర్తిస్తుంది. ఆటుపోట్లను  జీర్ణించుకొని, అవాంతరాలను ఛేదించి, వ్యతిరేక అంశాలను నిలదీసి, ఉమ్మడి కార్యాచరణ సమన్వయంతో ఆశయాన్ని లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అలాంటి అవకాశం ఉన్నప్పటికీ భారత దేశం 74 సంవత్సరాల తర్వాత కూడా మెరుగైన సమాజాన్ని నిర్మాణం చేయలేకపోతున్నాం. అంటే సంస్థాగత, వ్యవస్థాగత, అంతర్గత లోపాలతో పాటు విస్మరిస్తున్న పౌర సమాజం బాధ్యత, పాలకుల విధానాలను సమీక్షించుకోవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.


   ప్రజలు పౌరసమాజం బాధ్యతను విస్మరిస్తే ఎలా:
    ప్రభుత్వం ప్రతిపక్షాలు కలిస్తేనే సుపరిపాలన  సాధ్యమవుతుంది. అలాగే ప్రభుత్వ కృషికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, పౌరసమాజం చిత్తశుద్ధిగా తోడైతేనే మెరుగైన సమాజం ఆవిష్కృతమవుతుంది. వ్యవస్థలో ఉన్నత వర్గాలు,  భూస్వాములు, కార్పోరేట్ సంస్థల విచ్ఛిన్నకర ధోరణి కూడా అట్టడుగు పేద వర్గాలకు ఎంతో హాని చేస్తున్నది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు ఎలాగూ పట్టించుకోవు. పట్టించుకోవలసినదల్లా విద్యావంతులు, బుద్ధిజీవులు, మేధావులు, పీడితులు. తమ కళ్ల ముందు ఎంత అన్యాయం జరుగుతున్నా, ఒక వర్గం దోపిడీకి గురవుతున్న, పోలీసులు పరిధి దాటి వేధింపులకు పాల్పడుతున్నా స్పందించక మౌనంగా ఉంటున్న సమాజంలో మనమంతా తలవంచుకుని ఉన్నామా..? అనిపిస్తుంది. నాకెందుకులే, ఎవరు ఎక్కడ పోతే ఏమి, మాట్లాడితే శత్రువులు అవుతారు, కక్ష సాధించడం కోసం టార్గెట్ చేస్తారు అని కారణాలు ఏవో చూపి స్పందించకుండా నేరాన్ని చూస్తూ కూడా నేరస్తులుగా మిగిలిపోతున్నాం. నిజమా..? కాదా..?  నిత్యజీవితంలో పౌర బాధ్యతల విషయంలో కూడా పరిశుభ్రత, రోగాల నిర్మూలన, మానవ సంబంధాలు, పన్నుల చెల్లింపు, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం, శాంతిభద్రతల రోడ్డుప్రమాధాల నిర్మూలన వంటి అనేక విషయాలలో కూడా నిర్లిప్తంగా మనం వ్యవహరిస్తే మెరుగైన సమాజం ఎలా ఏర్పడుతుంది..? రౌడీలుగా,  గూండాలుగాఅరాచకాలకు మనలో కొందరు పాల్పడుతున్న మాట నిజం కాదా..? నిరక్షరాస్యులు, కార్మికులు, రైతులు కూడా తమ పనిలో నిమగ్నమైన కారణంగా ప్రశ్నించి ప్రతిఘటించ లేకపోతున్నారు. దోపిడీలు, దహన కాండలు, అత్యాచారాలు, రౌడీమూక ఆగడాలు, బార్ షాపులో అరాచకాలు, క్లబ్బులలో నిషేధిత ప్రదర్శనలు కళ్ల ముందు జరుగుతున్న మనం ప్రశ్నించడం లేదు. ప్రభుత్వాలు నిషేధించడం లేదు నిజమా..? కాదా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: