దేవినేని ఫ్యామిలీకి ఈ సారైనా కలిసొస్తుందా?

M N Amaleswara rao
కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఫ్యామిలీ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. కమ్మ వర్గానికి చెందిన దేవినేని ఫ్యామిలీ...విజయవాడ రాజకీయాలని శాసించేది. తెలుగుదేశం పార్టీ వచ్చాకే దేవినేని ఫ్యామిలీ బాగా హైలైట్ అయింది. ఒకవైపు దేవినేని నెహ్రూ, మరోవైపు దేవినేని వెంకటరమణలు టీడీపీకి కీలకంగా ఉండేవారు. అయితే దేవినేని నెహ్రూ మధ్యలో టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. అటు దేవినేని వెంకటరమణ చనిపోవడంతో ఆయన సోదరుడు దేవినేని ఉమా రాజకీయాల్లోకి వచ్చారు.
రమణ తర్వాత ఉమా టీడీపీలో కీలక పాత్ర పోషించారు. అటు కాంగ్రెస్‌లో నెహ్రూ కీలకంగా ఉంటూ వచ్చారు. అయితే 2014 తర్వాత నెహ్రూ తన తనయుడు అవినాష్‌ని తీసుకుని టీడీపీలోకి వచ్చేశారు. అలాగే నెహ్రూ అనారోగ్యంతో మరణించారు. దీంతో అవినాష్ కీలక నాయకుడుగా ఎదిగారు. ఇక 2019 ఎన్నికల్లో ఉమా, అవినాష్‌లు టీడీపీ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
మైలవరం నుంచి ఉమా, గుడివాడ నుంచి అవినాష్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే నెక్స్ట్ అవినాష్...టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చి...విజయవాడ తూర్పు ఇంచార్జ్‌గా పనిచేస్తున్నారు. అటు ఉమా ఎలాగో టీడీపీలో కీలక నాయకుడుగా ఉంటూ...మైలవరం బాధ్యతలు చూసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు నేతలు...నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మైలవరంలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ఉమా ట్రై చేస్తున్నారు. అక్కడ తన ప్రత్యర్ధి వసంత కృష్ణప్రసాద్‌కు చెక్ పెట్టి సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. దీని బట్టి చూస్తే మైలవరంలో రాజకీయం కాస్త మారుతున్నట్లే కనిపిస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఉమాకు కలిసొచ్చేలా ఉంది.
ఇటు తూర్పులో అవినాష్ సైతం దూకుడుగా పనిచేస్తున్నారు...విజయవాడ కార్పొరేషన్ వైసీపీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాకపోతే తూర్పు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ కూడా కాస్త స్ట్రాంగ్‌గా ఉన్నారు. కాబట్టి అవినాష్ కాస్త కష్టపడాలి. మరి చూడాలి ఈ సారి ఎన్నికల్లో దేవినేని ఫ్యామిలీకి ఏమన్నా కలిసొస్తుందేమో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: