మళ్లీ మొదటికి వచ్చిన పీఆర్‌సీ వివాదం..!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య పీఆర్‌సీ వివాదం ఇప్పట్లో తెగేలా లేదు. వారం రోజుల్లో పీఆర్‌సీ పై ప్రకటన చేస్తామని ఈ రోజు ఉదయమే తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులతో అన్నారు. కానీ ఈ సాయంత్రమే ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. సచివాలయంలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లకు ప్రభుత్వం నో చెప్పేసింది. పీఆర్‌సీ నివేదికను ముందుగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇందుకు ప్రభుత్వం విముఖత చూపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు... సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. తమకు ముందుగా పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని... ఆ తర్వాతే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాల నేతలు.  ముఖ్యమంత్రి తిరుపతిలో చేసిన ప్రకటనపై కూడా ఉద్యోగ సంఘాల నేతలు క్లారిటీ ఇచ్చారు. తమకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదన్నారు ఉద్యోగులు.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ప్రభుత్వం తరఫున కార్యదర్శులు హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా పీఆర్‌సీ నివేదిక అంశమే మరోసారి ప్రస్తావనకు వచ్చింది. దీనిలో సాంకేతిక అంశాలపై ఇంకా అధ్యయనం చేస్తున్నామని.. క్లారిటీ ఇంకా రాలేదని ఉద్యోగ సంఘాల నేతలకు కార్యదర్శులు వెల్లడించారు. అందువల్ల పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమన్నారు ప్రభుత్వ కార్యదర్శులు. దీంతో తీవ్ర అసహానానికి గురైన నేతలు.... పీఆర్‌సీ నివేదిక కూడా ఇవ్వలేనప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఇలాంటి మీటింగ్‌లు ఎందుకు నిర్వహిస్తున్నారని కూడా ప్రశ్నించారు ఉద్యోగ సంఘాల నేతలు. అసలు నివేదిక ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని నిలదీశారు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. ఇప్పటికే 71 అంశాలతో వినతి పత్రం ఇచ్చామని... కానీ కార్యదర్శుల కమిటీ మాత్రం ఇప్పటికీ కాలయాపన చేస్తూనే ఉందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తేల్చి చెప్పే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని మరోసారి హెచ్చరించారు బండి శ్రీనివాసరావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: