రాజ్యసభలో వైసీపీ ప్రవేటు బిల్లులు...!

Podili Ravindranath
పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి... పెద్దల సభలో కీలక డిమాండ్లు చేశారు. మూడు ప్రైవేటు బిల్లులను కూడా రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత... జగన్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం అమ్మ ఒడి. దీనిపై  ఇప్పుడు వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు ప్రైవేటు బిల్లుల్లో అమ్మఒడి పథకం, నిరుద్యోగ భృతితో పాటు ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడే వారికి శిక్షల పెంపు బిల్లు కూడా వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు వీటిపై పెద్దల సభలో చర్చ జరగాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మ ఒడి పథకాన్ని దేశమంతటా అమలు చేసేందుకు వీలు కల్పించాలని సూచించారు. ఇందుకోసం బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం సవరణ 2020 పేరుతో విజయసాయి రెడ్డి ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు.
విద్యాలయాల్లో నమోదు అయ్యే విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఇందుకోసం విద్యార్థి తల్లి లేదా సంరక్షకునికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఇది విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకువచ్చి.. దీనిని దేశ వ్యాప్తంగా కూడా కేంద్రం అమలు చేయాలని విజయసాయి రెడ్డి సభలో కోరారు. అదే సమయంలో నిరుద్యోగ భృతి అమలుపై కూడా కీలక బిల్లు ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా నిరుద్యోగులకు భృతి ఓ హక్కు కావాలన్నారు. దేశంలోని 21  నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న గ్యాడ్యుయేట్లు భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ బిల్లును రాజ్యసభలో విజయ సాయిరెడ్డి ప్రవేశపెట్టారు. దీని వల్ల దేశంలోని నిరుద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వెల్లడించారు. ఇక ప్రార్థనా మందిరాలపై దాడుల విషయాన్ని కూడా విజయ సాయిరెడ్డి ప్రస్తావించారు. ప్రార్థనా మందిరాలపై దాడులకు పాల్పడే నిందితులకు కఠిన జైలు శిక్ష విధించాలని కోరుతూ మూడో బిల్లును వైసీపీ ఎంపీ పెద్దల సభలో ప్రవేశపెట్టారు ఈ రోజు. ఈ మూడు బిల్లులపై సోమవారం చర్చ జరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: