ఉత్తరాంధ్రకు పెనుగండం.. ఏ రేంజ్‌లో అంటే..?

Chakravarthi Kalyan
ఉత్తరాంధ్ర జిల్లాలకు పెను గండం పొంచి ఉంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాన్ ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం... ప్రస్తుతం విశాఖ కు 770, ఒడిశాలోని గోపాల్ పూర్ కు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తుపానుగా మారే సూచనలు ఉన్నాయి.

ఈ వాయుగుండం ప్రస్తుతం గంటకు 32 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది రేపు ఉదయనికి  ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో  పలుచోట్ల  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,  అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే దీని ప్రభావంతో వర్షాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.

ఈ అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి 70-90  కి.మీ వేగంతో బలమైన గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అందుకే మత్య్యకారులు వచ్చే సోమవారం వరకు వేటకు వెళ్ళరాదని ఆదేశాలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాల్లో అతి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తులు శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. ఈ జవాద్ తుపాను ప్రభావం ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,  తూర్పుగోదావరి జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఇవాళ బయలుదేరే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: