వెల "సిరి" : లాస్ట్ లెజెండ్

RATNA KISHORE
మెగాస్టార్ చిరు అన్నారు ఆయ‌న లాస్ట్ లెజెండ్ అని..ఇక‌పై ఎవ‌రు కూడా ఇంత‌టి స్థాయిలో ఆలోచించి రాయ‌డం జ‌ర‌గ‌ని ప‌ని?
క‌నుక సిరివెన్నెల లాస్ట్ లెజెండ్..
ఇన్ని నిజాల‌ను చూసిన క‌ళ్ల‌కు
కొన్ని విశ్రాంత కాలాలు కావాలి
అందుకే గుడ్డి జ‌పాలు చేస్తున్న వారిని
క‌సి తీరా తిట్టాల‌న్నా లేదా
న‌ట‌న‌తో రాణించాల‌న్న దృక్ప‌థం ఉన్న వారికి
త‌ప్పు అని చెప్పి స‌న్మార్గం చూపాల‌న్నా
మంచి  క‌వి మాత్ర‌మే చేయ‌గ‌లడు
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అన్న‌ది ఓ సినీ క‌వి మాట (సిరివెన్నెల పాట కాదు ఇది).. అలాంటి ఆకాశ‌పు దారుల చెంత కాస్త‌యినా వ్య‌క్తిత్వం ఉన్న వారు ఉంటే భూగోళానికి రానున్న క‌ష్టాల‌ను నిలువ‌రిస్తే ఇప్ప‌టికన్నా మంచి పాట‌లే వ‌స్తాయి. గొప్ప దనం నింపుకున్న పాట‌కు వ్య‌క్తిత్వం ఉంటుంది. రాసే వారి వ్య‌క్తీక‌ర‌ణ‌తో పాటు సంస్కృతిని కాపాడాల‌న్న తలంపు ఒక‌టి అవ‌ధి బిందువు అయి ఉంటుంది. క‌నుక రాసే వారికి  వినే వారికి మ‌ధ్య ఉన్నంత అనుబంధం ఇప్ప‌టిది కాదు ఏనాటిదో!
 
స్వ‌ర్గ‌లోక‌పు దారుల్లో ఉంటారా ఇప్పుడు.. అవును! సిరివెన్నెల‌కు అక్క‌డేం ప‌ని.. స్వ‌ర్గాన్ని మించిన ఊహాలూ ఊహా లోకాలు ఇక్క‌డే సృష్టించి వెళ్లారు క‌నుక ఆయ‌న వ‌స్తే ఇటుగానే వ‌స్తారు. మ‌ళ్లీ మ‌న‌తోనే ఉంటారు. తెలుగింటి గౌర‌వం అయి వెలుగొందు తారు. వేటూరి వారింటి సుంద‌ర రాముడ్నీ తోడ్కొని వ‌స్తారు. పాట‌గా క‌ద‌లి మాట‌ల‌కు కూర్పు ఇచ్చి, కొద్దిగా కాదు ఎక్క‌వ‌గానే ఈ నేల‌ను ప్రేమిస్తారు. ఈ తెలుగును ప్రేమిస్తారు. కాస్త ప్ర‌య‌త్నిస్తే వేటూరి సీతారామ శాస్త్రి కావొచ్చు.. కానీ సీతారామ శాస్త్రి వేటూరి కాలేరు..అని ఓ సంద‌ర్భంలో ఆయ‌నే చెప్పారు ఈ మాట. క‌నుక పాట రాసినా రాయ‌కున్నా ఒక విధం అయిన నిర్వేదం ఏనాడూ లేదు రాదు కూడా!  ఆ విధంగా ఆయ‌న చేయ‌రు కూడా!
ఇక్క‌డితో ఓ క‌థ ఆగిపోయింది. బిళ‌హ‌రి గ‌ణ‌ప‌తి శాస్త్రి చెప్పిన విధంగానో లేదా సిరివెన్నెల సీతారామ శాస్త్రి చెప్పిన విధంగానో ఇక్క‌డితో ఈ క‌థ ఆగిపోయింది. రేప‌టి నుంచి కొత్త వారు వ‌స్తారు. కొత్తవేవో ఊసులు చెప్పి చెవులు రిక్కించేలా వినే శ‌క్తి మ‌న‌కు ఇస్తే ఆనందించాలి మ‌నం.. అంత‌బాగా రాయ‌గ‌లిగే నేర్పూ ఓర్పూ కొత్త వారికి కొత్త క‌వుల‌కు ద‌క్కితే చాలు.. మ‌ట్టిలో క‌ల‌సిన క‌వితా తేజం ఈ మ‌ట్టినీ ఈ తెలుగునీ కాపాడుతుంద‌నే అనుకుందాం. కాల గ‌ర్భంలో క‌లిసిపోనివ్వ‌క మంచి సాహిత్యం బ‌తికేందుకు ఊతం అందిస్తార‌నే అనుకుందాం. ప్రార్థిద్దాం. ఓట‌ములూ గెలుపులూ అన్న‌వి లెక్క‌కు అంద‌నివిగా ఉంటే, అప్పుడు కూడా ధైర్యం చావ‌క ప్ర‌య‌త్నించ‌డం ఒక‌టి త‌ప్పక చేద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: