ప్రభుత్వ సంకల్పానికి తూట్లు...!

Podili Ravindranath
నిరుపేద కుటుంబాల పిల్లలు సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలనే ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం అత్యంత ప్రధానమైన అంశం. చదువుకునే విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజనం అమలు చేస్తోంది. ఈ పథకం సరిగ్గా అమలు చేసే బాధ్యతను ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యా కమిటీలకు అప్పగించింది కూడా. కానీ ఇప్పటికే పలు చోట్ల ఈ పథకం అమలుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా సరైన ఆహారం అందించకపోవడంతో బాలికలకు అనారోగ్య సమస్యలు వచ్చాయి.
పాఠశాలలో ఆహారం సరిగ్గా ఉండటం లేదంటూ పిల్లలు కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. పేరెంట్స్‌కు వివరణ ఇవ్వాల్సిన పెద్ద సారు... తల్లిదండ్రులపై చిందులు తొక్కారు. పైగా మీకు పాఠశాల నచ్చక పోతే పోయి వేరే స్కూల్ లో జాయిన్ అవ్వండి అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీంతో బాలికల తల్లిదండ్రులు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఉపాధ్యాయులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగధంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం పెట్టాల్సిన బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులపైనే ఉందని... కానీ... అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు తల్లిదండ్రులు. ఈ విషయం పై జిల్లా, మండల స్థాయి అధికారులు కఠిన చర్యలు తీసుకొని పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: