ఓటీఎస్‌పై జగన్ క్లారిటీ....!

Podili Ravindranath
ఓటీఎస్.... వన్ టైమ్ సెటిల్మెంట్... ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాలకు కేంద్రంగా మారింది. సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. దీన్ని స్వచ్ఛందంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా కూడా... అది తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. క్షేత్రస్థాయిలో లబ్దిదారులపై ఒత్తిళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఓటీఎస్ చేయని వారికి ప్రభుత్వ పథకాలు ఆపాలంటూ శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి అధికారులు ఇచ్చిన ఆదేశాలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారి తీసింది. విపక్షాలు దీన్ని ఓ సాకుగా తీసుకుని.. ప్రభుత్వంపై విమర్శలు చేశాయి కూడా. దీంతో ఓటిఎస్ పథకంపై జరుగుతున్న ప్రచారంపై స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఓటీఎస్ పథకంపై వస్తున్న తప్పుడు ప్రచారంపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని జగన్ ఆదేశించారు. దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు.
ఓటీఎస్ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ది జరుగుతుందన్నారు వైఎస్ జగన్. పేదలకు తాము నివసించే ఇళ్లపై చట్టపరమైన హక్కులు వస్తాయని కూడా అన్నారు. పేదలకు మేలు చేసే పథకంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వైఎస్ జగన్. లబ్దిదారుల్లో ఉన్న సందేహాలను, అనుమానాలపై అధికారులే స్వయంగా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. ఓటీఎస్ ద్వారా రిజిస్టర్ పత్రాలతో  లబ్దిదారులకు అసలు, వడ్డీ మాఫీ అవుతాయని... ఆ వివరాలను కూడా ప్రదర్శించాలన్నారు. అయితే కేవలం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికే ఓటీఎస్ పథకం అమలు చేయాలన్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: