మహిళా పోలీస్ వాలంటీర్ల వ్యవస్థ రద్దు

Deekshitha Reddy
మహిళా పోలీసు వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. మహిళా పోలీసు వాలంటీర్ల వ్యవస్థ ఆశించిన మేరకు ఫలితాలను ఇవ్వకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని సరిగా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 2016లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర హోమ్ శాఖతో కలిసి ఇన్ని రోజులూ పని చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఇకపై ఈ మహిళా పోలీసు వాలంటీర్ల వ్యవస్థ కనుమరుగు కాబోతోంది.
గతంలో మన దేశంలో మహిళలపై వేధింపులు, గృహ హింస ఎక్కువగా ఉండేది. దీంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మహిళా పోలీసు వాలంటీర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూనే.. ప్రజలకు చేరువగా, మహిళలకు అండగా ఈ పోలీసు వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పధకం సత్ఫలితాలను ఇస్తుందని అందరూ భావించారు. అయితే అనుకున్న మేర ఫలితాలు లేకపోవకడంతో ఈ పథకంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు పార్లమెంట్ స్థాయూ సంఘం కూడా ఈ పధకాన్ని రద్దు చేయమని సూచించింది. దీంతో కేంద్రం ఈ వ్యవస్థను రద్దు చేసేందుకు నిర్ణయించింది.
మనదేశంలో ప్రస్తుతం మహిళా పోలీస్ వాలంటీర్ల వ్యవస్థ 13 రాష్ట్రాల్లో అమలవుతోంది. వాటిలోనూ కేవలం ఐదంటే ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఈ వ్యవస్థ అరకొరగా పనిచేస్తోంది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్స్, సెక్యూరిటీ పెరగడం, మహిళా పోలీసు స్టేషన్లలో మెరుగైన సేవలు అందడం వంటివి కూడా ఈ వ్యవస్థ మరుగున పడిపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఇలా కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టుగానే ఈ మహిళా పోలీసు వాలంటీర్ల వ్యవస్థ నిర్వీర్యమై పోవడానికి కారణాలున్నాయి. అయితే ఈ వ్యవస్థను రద్దు చేసినప్పటికీ మహిళలల రక్షణ, భద్రత కోసం మాత్రం మిషన్ శక్తి పధకం అమలవుతుందని కేంద్రం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: