పంట చేతికందుతుందా ? లేదా ?.... ఏమిటి కర్తవ్యం


ఆంధ్ర ప్రదేశ్ లో దక్షిణ కోస్తా తీరాన్ని, రాయల సీమను ముంచెత్తిన వరుస తుఫాన్లు, వరదలు అక్కడి రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. ఇప్పుడు భయపడటం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వాసుల వంతవుతోంది. వారికి తుఫాన్ ప్రమాదం ముందు ముందు ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా పేర్కోన్నారు. గడచిన రెండు రోజులుగా ఉత్తరాంధ్ర తో పాటు ఉభయగోదావరి జిల్లాలలనూ చెదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కూడా నమోదైంది. ఈ జిల్లాలలో వరి పంట కోత దశల్లో ఉంది. దాదాపు పదివేల ఎకరాలకు పైగా వరి సాగు చేసినట్లు అధికారులు పేర్కోంటున్నారు. ఇప్పటికే పంట కోత దశకు వచ్చేసింది. రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల వరి కంకులు నేల వాలాయి కూడా. అయితే కోతకు ఇబ్బంది లేదు. వాన తెరపిస్తే పంటను కోసి ఆరబెట్టుకుందామని రైతులు భావిస్తున్న సందర్భమిది. అయితే వారికి వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్తను చెప్పింది. తూర్పుతీరంలో ఏర్పడిన వాయుగుండం తుఫాను గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల తో పాటు, ఉభయగోదావరి , పరిసర జిల్లాల పై ఉంటుందని ప్రకటించింది. డిసెంబర్ మూడు, నాలుగు తేదీలలో అరవై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. దీంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్లు తమ సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్లు నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేయించాలని కలెక్టర్లు తమ సిబ్బందికి తెలిపారు.
ఉత్తరాంధ్ర తో పాటు ఒడిశా  సరిహద్దు ప్రాంతాలలోనూ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
 ఈ అల్పపీడనం థాయిలాండ్  దక్షిణ ప్రాంతంలో ఏర్పడిందని,  ఇది డిసెంబర్ మూడు నాలుగు తేదీలలో తూర్పు తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది మరింత బలబడితే దాని ప్రభావం ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల పై ఉంటుందని మరో వారం రోజుల పాటు ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: