ఆ రెండు సీట్లలో ‘ఫ్యాన్’కు మూడో ఛాన్స్ లేదా?

M N Amaleswara rao
రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయాలు ఊహించని విధంగా మారుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీ హవా కొనసాగిన నియోజకవర్గాల్లో పరిస్తితులు మారుతున్నాయి...కొన్ని చోట్ల వైసీపీకి ధీటుగా టీడీపీ పుంజుకుంటుంది. అదే సమయంలో మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేన కూడా బలం పుంజుకుంటుంది. అలాగే టీడీపీ-జనసేనలు గానీ కలిస్తే తూర్పు రాజకీయం మొత్తం మారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే రాజకీయాలు ఎలా మారిన సరే కొన్ని చోట్ల వైసీపీకి ఎదురుగాలులు వీస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ గత రెండు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్న నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా రెండు సార్లు గెలుస్తూ రావడంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీపై ప్రజా వ్యతిరేకత కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతున్నట్లు కనబడుతోంది. అలా రెండు సార్లు గెలిచిన నియోజకవర్గాల్లో వైసీపీకి మూడోసారి గెలిచే అవకాశం మాత్రం కాస్త కష్టమే అనిపిస్తోంది.
అలా వైసీపీకి మూడోసారి గెలుపు కష్టమయ్యే నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు, కొత్తపేట నియోజకవర్గాలు ఉంటాయి. 2014, 2019 ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీనే గెలుస్తూ వస్తుంది. కానీ ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. అసలు కొత్తపేటలో వైసీపీకి ఏ మాత్రం అనుకూల పరిస్తితులు కనిపించడం లేదు. గత రెండు ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగానే కొత్తపేటలో వైసీపీ గెలుస్తూ వచ్చింది. 2014లో 713 ఓట్ల మెజారిటీతో..2019 ఎన్నికల్లో 4 వేల మెజారిటీతో వైసీపీ గెలిచి బయటపడింది. కానీ ఈ సారి మాత్రం కొత్తపేట ప్రజలు వైసీపీకి అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు.
అటు ప్రత్తిపాడు నియోజకవర్గానికి వచ్చిన అదే పరిస్తితి. 2014లో 3 వేల మెజారిటీ, 2019 ఎన్నికల్లో 4 వేల మెజారిటీతో వైసీపీ విజయం సాధించింది. కానీ ఈ సారి మాత్రం మూడో ఛాన్స్ వచ్చేలా లేదు. పైగా టీడీపీ-జనసేనలు కలిస్తే ఈ రెండు చోట్ల వైసీపీకి మూడో ఛాన్స్ కలే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: