రెక్కలు లెక్కలు : పరుగు సీఎంది..పదవి సీనియర్లది!

RATNA KISHORE
కష్టం అంతా ఒక్కరిదే కావడంతో పది సార్లు ఒక పని  చేయమని చెప్పినా వినిపించుకోలేని యంత్రాంగం అంతా ఇవాళ ఆంధ్రావనిలో ఉంది. మొదట్నుంచీ పెద్దగా అధికారులను ఏమీ అనని లేదా అనలేని మనస్తత్వం ఉన్న జగన్ ఆ పంథానే కొనసాగిస్తూ ఇప్పటిదాకా వస్తున్నారు. కానీ ఇక తన రూట్ మార్చాలని, ఆకస్మిక తనిఖీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు కొందరు వైసీపీ కార్యకర్తలు. సీఎం పరుగులు తీసి పని చేస్తున్నా కూడా ఆ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఆశించిన విధంగా పనులు జరగడం లేదు సరి కదా! కొందరి అధికారుల తీరూ తెన్నూ కూడా అంత బాగా లేవు.

దాదాపు పదేళ్ల కష్టం జగన్ ది. పార్టీ పెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ఆయన శ్రమిస్తూనే ఉన్నారు. అధికారం దక్కింది కదా అని ఆయన హాయిగా కాలం గడిపేయడం లేదు. ఉన్నవాటితోనే సర్దుకుపోతూ వీలున్నంత వరకూ ఇచ్చిన హామీల నెరవేర్పునకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఆయనకు సరైన సహకారం అందకపోయినా కూడా అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకునిపోతున్నారు.

కొన్ని పథకాలకు నిధులు అందకపోయినా చాలకపోయినా అన్నింటినీ అర్థం చేసుకుని వీలున్నంత వరకూ బ్యాంకుల సాయం రుణ రూపేణ పొందుతూనే లబ్ధిదారులకు సకాలంలో న్యాయం చేసేందుకు ఆర్థికంగా ఆదుకునేందుకు పరితపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేంద్రం కూడా సహాయ నిరాకరణకు సిద్ధం అయి, జగన్ స్పీడుకు చెక్ పెట్టాలని చూసినా అవేవీ జరగని పనులని తేలిపోయాయి. ఈ నేపథ్యంలో జగన్ కు ఉన్నంత విల్ పవర్ కానీ ఏదేమయినా సరే కష్టం వస్తే దాటుకుని రావాలన్న తలంపు కానీ తపన కానీ మంత్రుల్లో లేవు. ఎమ్మెల్యేల్లోనూ లేవు. తమ అధినేత వివిధ పథకాల రూపంలో డబ్బులు పంచుతున్నారు కదా! ఇక రాజకీయ భవిష్యత్ కు ఢోకా ఏంటన్న స్థిర అభిప్రాయంలో  ఉన్నారు. వాస్తవానికి ఇదెంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.
వరదల సమయంలో ముఖ్యమంత్రి చెప్పినా తమ పరిధిలో ఉన్న పీడిత లేదా బాధిత ప్రాంతాలకు ఎమ్మెల్యేలు వెళ్లలేదన్న ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. తాను నిధులు చాలకపోతే ఏదో ఒక ప్రయత్నం చేసి తెస్తానే తప్ప సంబంధిత పథకాలు కానీ వాటి నడవడి కానీ ఆగేందుకు వీల్లేదని తరుచూ జగన్ చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో నెలకొంటున్న పరిణామాలు ఇందుకు భిన్నంగా  ఉన్నాయి. కార్యకర్తలు అటు పనుల్లేక ఇటు ప్రభుత్వ పనులు చేజిక్కించుకోలేక ఎంతగానో సతమతం అవుతున్నారు. ఇలాంటి వారికి కూడా ఉన్నంతలో చేయూత ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. కానీ జిల్లాలలో ఉన్న స్థానిక నాయకత్వాలకు  కార్యకర్తల గోడు కానీ లేదా వారి కుటుంబాల గోడు కానీ పట్టడం లేదు.

దీంతో సీఎం చెప్పినా కూడా వినని వారికి ఉద్వాసన కల్పించడంతో పాటు ఇకపై కార్యకర్తల సంక్షేమంకు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు సీఎం. కానీ సీఎం పరుగులను అర్థం చేసుకోలేని వారే ఎక్కువగా ఉండడంతో ఆయన అనుకున్న విధంగానో ఆశించిన విధంగానో మంచి పాలనను అందించలేకపోతున్నారు. ఇదే తరుణాన పార్టీ పనులతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాల విషయమై కూడా ఎంపీలూ, ఎమ్మెల్యేలూ సరిగా ఇన్వాల్వ్ కావడం లేదు. దీంతో వీటన్నింటీపై టీడీపీ అధిష్టానం ఫోకస్ చేస్తే సీఎం జగన్ ను టార్గెట్ చేస్తే తమ గతేం కాను అని కొందరు వైసీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: