మళ్లీ దిల్లీలో ఉద్యమం.. 4 లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ..?

Chakravarthi Kalyan
ఏడాది పాటు అలుపెరగని పోరాటం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మెడలు వంచిన రైతు సంఘాలు ఇప్పుడు మరో పోరుకు సిద్ధం అవుతున్నాయి. సాగు చట్టాలపై పోరాటం ప్రారంభించి.. దాదాపు ఏడాది తర్వాత  ఫలితం అందుకున్న రైతు నాయకులు.. ఇప్పుడు మరో కీలక అంశంపై పోరాటాన్ని ప్రకటించాయి. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు స్వయంగా ప్రధాన మంత్రి ప్రకటించిన తర్వాత.. ఇక రైతు ఉద్యమం ముగిసిపోయిందని చాలా మంది భావించారు. అయితే.. రైతు సంఘాలు మాత్రం తమ పోరాటం ఇంకా ముగియలేదని చెబుతున్నాయి.

అంతే కాదు... వచ్చే జనవరి 26న ఢిల్లీలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. గత జనవరి 26న రైతులు చేపట్టిన ఢిల్లీ ముట్టడి కార్యక్రమం ఎంత తీవ్ర రూపు దాల్చిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ఎర్రకోటపై సైతం ఆందోళన కారులు జెండాలు కట్టారు. డిల్లీలో ఆందోళన కారులు అరాచకం సృష్టించారు. అయితే.. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే కేంద్రం చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. రైతు సంఘాల ముసుగులో కొందరిని పంపి.. ఇలా రైతు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో రైతు సంఘాలు ఆరోపించాయి.

ఆ తర్వాత ఉద్యమం కాస్త జోరు తగ్గినా.. రైతు నాయకులు మాత్రం దీర్ఘకాలిక పోరుకు తాము సిద్ధం అని ప్రకటించారు. అదే జోరు కొనసాగించారు. మొత్తానికి కేంద్రం మెడలు వంచారు. ఎన్నికల కారణంగానో.. లేదా.. రైతు వ్యతిరేకిగా ముద్రపడటం ఇష్టం లేకనో మొత్తానికి మోడీ సర్కారు సాగు చట్టాలను ఉపసంహరించుకుంది. రైతులకు మోడీ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే.. సాగుచట్టాలను ఉపసంహరించుకున్నా.. కనీస మద్దతుధరపై చట్టం చేయాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ టికాయత్‌ డిమాండ్ చేశారు.

ఈ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం మద్దతు ధరపై చట్టం చేయని పక్షంలో జనవరి 26న 4 లక్షల ట్రాక్టర్లు, రైతులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని రాకేష్‌ టికాయత్‌ హెచ్చరించారు. మరి మోడీ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: