డ్రాగ‌న్ కంట్రీ కొత్త ఆంక్ష‌లు.. సెలెబ్రిటీలు అవి చేయ‌డానికి వీలు లేదు..!

Paloji Vinay
వినోద ప‌రిశ్ర‌మపై చైనా క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం అణ‌చివేత ధోర‌ణిని కొనసాగిస్తూనే ఉంది. సెలెబ్రెటీలు సోష‌ల్ మీడియాల్లో త‌మ సంప‌ద‌, విలాసాల గురించి గొప్ప‌లు చెప్పుకోకుండా నిషేధం విధించింది. విప‌రీత‌మైన ఆనందాన్ని వ్య‌క్తం చేయ‌కుండా ఆంక్ష‌లు విధిస్తోంది. సైబ‌ర్ స్పేస్ అడ్మినిస్ట్రేష‌న్ ఆఫ్ చూనా ఈ మేర‌కు మంగ‌ళ‌వారం అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. క‌ఠిన‌మైన ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. సెలెబ్రిటీలు త‌ప్పుడు, వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సామాజిక మాధ్య‌మాల్లో పెట్ట‌కూడ‌దు. అలాగే ఇత‌ర ఫ్యాన్స్ గ్రూపుల‌ను రెచ్చ‌గొట్ట‌కూడ‌దు.

   దీంతో పాటు వదంతులు అస్స‌లు వ్యాప్తి చేయ‌రాదు. ప్ర‌ముఖులు, వారి అభిమానులు ఈ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌కుండా పాటించి తీరాల‌ని నిబంధ‌న‌ల ద్వారా హుకుం జారీ చేసింది డ్రాగ‌న్ ప్ర‌భుత్వం. వినోద ప‌రిశ్ర‌మ‌పై త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగించ‌డానికి.. సెలెబ్రిటీ సాంప్ర‌దాయానికి చెక్ పెట్టేందుకు చైనా  ప్ర‌భుత్వం ఈ కొత్త నిబంధ‌న‌ల‌ను తీసుకువ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లో వినోద ప‌రిశ్ర‌మ స‌ద‌స్త‌సు నిర్వ‌హించింది చైనా. ధ‌నారాధ‌న‌, వ్య‌క్తిగ‌త నినాదం, సుఖ‌వాదం వంటి వాటిని సెలెబ్రిటీలు ఖ‌చ్చితంగా వ్య‌తిరేకించాల‌ని ఆదేశించింది.

 పార్టిని, దేశాన్ని ప్రేమించండి, నైతిక‌త‌-క‌ళ‌ను ఆరాధించండి అనే నినాదాన్ని లేవ‌నెత్తింది. సామాజిక, వ్య‌క్తిగ‌త  విలువ‌ల‌కు త‌ప్ప‌కుండా క‌ట్టుబ‌డి ఉండాల‌ని పిలుపునిచ్చింది. సెలెబ్రిటీ సంస్కృతి, సంపాదించాల‌నే అత్యాశ పాశ్చ‌త్యా దేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న ప్ర‌మాద‌క‌ర అంశం అని ఇది క‌మ్యూనిజానికి ముప్పు చేకూర్చుతుంద‌ని చైనా భావిస్తుంది. ఇవి సామూహిక వాదాన్ని కాకుండా వ్య‌క్తిగ‌త వాదాన్ని ప్రోత్స‌హిస్తుంద‌ని  బ‌లంగా విశ్వ‌సిస్తోంది. అందుకే ప్ర‌ముఖుల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించే అన్న పేరుతో ప‌లువురు సెల‌బ్రెటీల‌ను చైనా ఆగ‌స్టులో బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. స్వ‌లింగ సంప‌ర్కుల సంబంధాలు, మ‌గ‌వాళ్ల‌ను ఆడ‌వాళ్లుగా చూపించే స‌న్నివేశాలు ఉండే వీడియో గేమ్‌ల‌ను నిషేధించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోందని స‌మాచారం. ఇక నుంచి సినిమాల‌ను వినోదంగా చూడ‌కుండా చ‌రిత్ర, సంస్కృతికి తార్కాణాలుగా చూస్తామ‌ని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: