సంక్షేమమా.. ఉద్యోగులా... జగన్ ప్రాధాన్యత ఏమిటో...!

Podili Ravindranath
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవటంలో రాష్ట్ర ప్రజల ఓట్లతో పాటు ఉద్యోగుల సహకారం కూడా ఉంది. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలు తీర్చుతారని అటు పేదలు, ఇటు ఉద్యోగులు గంపెడంత ఆశతో ఉన్నారు. కానీ జగన్ ప్రాధాన్యత మాత్రం రాష్ట్ర ప్రజలే అని తేల్చేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలు వైపు మొగ్గు చూపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాల పథకాలను ఏడాది లోపే 90 శాతం అమలు చేసేశారు. అలాగే సంక్షేమ పథకాల కోసం ఇప్పటికే నిధులను పెద్ద ఎత్తున వెచ్చిస్తోంది జగన్ సర్కార్. దీనికి తోడు కరోనా కూడా తొడవ్వటంతో... రాష్ట్ర ఖజానాపై పెను భారం పడింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా.. సంక్షేమ పథకాల అమలులో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించలేదు. అదే సమయంలో ఉద్యోగుల సమస్యలను మాత్రం పక్కన పెట్టేసింది వైసీపీ ప్రభుత్వం.
హామీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం... ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందనే అపవాదు మూట గట్టుకుంది. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఉద్యోగులు కొంత కాలం ఆగలేరా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుపై ఉన్న శ్రద్ధ తమపై లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పరిస్థితి ఉద్యోగులు వర్సెస్ పేదలు అన్నట్లుగా మారిపోయింది. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా కొత్త ఆలోచనకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు చేసే డిమాండ్లను ప్రస్తుతం ప్రభుత్వం నెరవేర్చలేని పరిస్థితి. దీంతో ... ఉద్యోగులను పేదలతో టార్గెట్ చేయిస్తే ఎలా ఉంటుందని జగన్ సర్కార్ భావిస్తోంది. వేల రూపాయల జీతాలు తీసుకుంటూ కూడా... పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఎలా తప్పుబడతారంటూ ఉద్యోగులపైకి ప్రజలను రెచ్చగెట్టేందుకు జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి... జగన్ సర్కార్ ఆడబోయే ఈ గేమ్‌లో గెలుపు ఎవరిదో...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: