ఉచితం : నేతల జేబులోవా లేక ప్రజల సొమ్మేనా..?

Chandrasekhar Reddy
రాజకీయనేతలు భలే మాట్లాడతారు. వారి మాటలకే ప్రజలు కూడా మైమరచి ఓట్లు గుద్దేస్తుంటారు. అలా మాటలతో మాయచేయడం వరకే తప్ప అధికారం వచ్చిన తరువాత తమను పట్టించుకోరనేది ఇప్పటికైనా ప్రజలకు అర్ధం అయ్యింది అనుకోవాలి, అలా కాకపోయినా చేసేది ఏమి లేదు. ఇక వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి, మీకు అన్ని ఉచితంగా ఇస్తున్నాం అంటున్నారు. లక్షల ఖర్చు అయ్యేవి మీకు రూపాయి ఖర్చు లేకుండా లభ్యమయ్యేట్టు చేస్తున్నాం అంటున్నారు. అంటే నిజంగా ఆ లక్షల ఖర్చు వాళ్ళేదో భరిస్తున్నట్టేనా, ప్రజలు ఇదే అర్ధం చేసుకుంటున్నారా, ఇంకా ఇంత అమాయకంగానే ఉన్నారా అనేది ప్రశ్న. అధికారం లోకి రావడానికి చెప్పడం తప్ప చేయలేని అనేక పధకాలు తీసుకొస్తారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని మరిచిపోయి, దండుకోవడం అనే పనిలో బిజీగా ఉంటారు.
ఇంత బిజీగా ఉన్నవాళ్లను ఎప్పుడైనా ప్రజలు కాస్తోకూస్తో పని చేయండని గుర్తు చేస్తే అప్పుడు కంటితుడుపు చర్యగా కొన్ని పధకాలు అమలు చేస్తారు. అది కూడా ఏమంటారు తాము కష్టం భరించి, ఈ పధకాలు ఉచితంగా ఆడించడం జరుగుతుంది అంటుంటారు. అవన్నీ వాళ్ళ డబ్బుతో నడిపిస్తున్నట్టుగా, నిజానికి వాళ్ళ కష్టం అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఆయా పధకాలలో కూడా కుదిరిన చోట కాస్తోకూస్తో దండుకోవడం వీలు ఉంటె ఆ అవకాశాన్ని కూడా వదలకుండా వాడేసుకుంటారు, అది మన నేతల నిజస్వరూపం. అందుకే గేదెల గడ్డి నుండి బ్యాంకుల వరకు అన్నీ స్కాం లే. అవన్నీ చూస్తూ కూడా ప్రజలు ఇంకా అలాంటి మాయగాళ్లు వచ్చి చెప్పిన మాటలు వింటూనే ఉన్నారు. ఓట్లు వేస్తూనే ఉన్నారు.  అది అమాయకత్వమో అర్ధం కాదు, నిర్లక్ష్యమో అర్ధం కాదు.
ఇలా పౌరులు లేదా ఓటరు ఉన్నంత కాలం నేతలు పధకాలను కూడా వాళ్ళ జేబులోంచి తీసిన డబ్బుతో నడిపిస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటారు. అది చూసి మాకోసం ఎంత కష్టపడుతున్నారో అని ఈ తిక్కల ప్రజలు కూడా మరోసారి మోసపోతారు. ఇదో బాగోతం దేశంలో. ముందు ఇది మారితే అప్పుడే దేశం అభివృద్ధి ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు జరిగింది అంతా ఆయా నేతల కోసం చేసిందే తప్ప, ప్రజల కోసం కాదు. కానీ చూడటానికి ప్రజల కోసం చేసినట్టుగా కనిపిస్తుంది అంతే. అంత బాధ్యత ఉన్న ప్రజలైతే, ఒక్కో తెలుగు రాష్ట్రానికి రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది కదా, అదంతా ఎలా ఖర్చుపెట్టారు అని అడిగి చూడండి, అప్పుడే తెలిసిపోతుంది, ఆయా పధకాలు వాళ్ళ జేబులోనుండి వచ్చాయో, బడ్జెట్ లోంచి వచ్చాయో అని. అంత చొరవ ప్రజలలో లేదు కాబట్టే ఇంకా దేశంలో ఇలాంటి రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు మారితేనే, దేశం మారేది. అప్పటి వరకు ఈ దౌర్బాగ్యం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: