ఫ్యాన్ ఆంధ్రా : రాజధాని రాజకీయం ఆగింది కానీ..?

RATNA KISHORE
వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు అనంత‌రం
మ‌ళ్లీ రాజ‌కీయం అసెంబ్లీ నుంచి
అసెంబ్లీ వ‌ర‌కూ సాగుతూనే ఉంది
కానీ మ‌న పాల‌కుల‌కూ విప‌క్షంకు
ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌డం లేదు అన్న‌దే విచార‌దాయ‌కం
రాజ‌ధాని క‌థ ఏంట‌న్న‌ది రానున్న సోమ‌వారం కోర్టు తేల్చ‌నుంది
అందాక గుంభ‌నంగా ఉన్న రాజ‌కీయ శ‌క్తులు త‌రువాత ఏ విధంగా స్పందిస్తాయో ?

రాజ‌కీయంలో కీలక ఘ‌ట్టాలు ఎన్నో ఉన్నాయి.ఎన్నో  అస్స‌లు చ‌ర్చ‌కు రాకుండా మ‌రుగున ప‌డిపోతున్నాయి. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నా, వాన‌లు ముంచెత్తుతున్నా, ప‌ట్టెడ‌న్నం దొర‌క‌క అల్లాడుతున్నా ప‌ట్ట‌ని రాజ‌కీయ నాయ‌కుల‌కు వ్య‌క్తిగ‌త వ్యాఖ్యలే ప్ర‌ధాన అజెండాగా మారాయి. రాజ‌ధాని రైతులు ఓ వైపు పాద‌యాత్ర చేస్తుంటే, మరోవైపు జ‌గ‌న్ మాత్రం అది 29 గ్రామాల స‌మ‌స్యేన‌ని దాంతో మాకేం ప‌ని అన్న విధంగా స్పందిస్తున్నారు. ఈ సంద‌ర్భంలోనే మ‌రికొన్న ప్ర‌తిపాద‌న‌లు కానీ డిమాండ్లు కానీ రాజ‌ధాని చుట్టూనే ప‌రిభ్ర‌మిస్తున్నాయి.

ముఖ్యంగా ముఖ్య‌మంత్రి  సొంత ప్రాంతం సీమ నుంచే ఎక్కువ డిమాండ్లు వ‌స్తున్నాయి. ఇప్పుడీ ప్రాంతం జ‌ల ప్ర‌ళ‌యంతో, పంట న‌ష్టాల‌తో అల్లాడిపోతోంది. వీటితో పాటు రాజ‌ధాని పై జ‌గ‌న్ ఎటూ తేల్చ‌క‌పోగా ఈ సోమ‌వారం హైకోర్టు ఏం చెబుతుందో అన్న ఉత్కంఠ కూడా పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలో సీమ‌కు చెందిన కొంద‌రు  తాము ప్ర‌కాశం, నెల్లూరుతో కూడిన గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ కోరుకుంటున్నామ‌ని అంటున్నారు. ఇంకొంద‌రు అమ‌రావ‌తిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోతే త‌మ‌కు ఆత్మ‌హత్య త‌ప్ప మ‌రో మార్గ‌మే లేద‌ని ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. ఇదంతా సోష‌ల్ మీడియాలో రికార్డు అవుతోంది. కానీ రాజ‌కీయం మాత్రం నివురు గ‌ప్పిన నిప్పులానే ఉంది. ఉత్త‌రాంధ్ర‌లో పాల‌నా సంబంధ రాజ‌ధాని ప్ర‌క‌టించాక కూడా ఆ ప్రాంత వాసులు ఏమీ సంతృప్తితో లేరు. ఎందుకంటే ఆ రోజు విజ‌య‌వాడ‌లో టీడీపీ, ఈ రోజు విశాఖ‌లో వైసీపీ భూముల పందేరం సాగించేందుకు మాత్ర‌మే రాజ‌ధాని రాజ‌కీయం న‌డుపుతున్నార‌ని వీరంతా మండిప‌డుతున్నారు. ఈ ద‌శ‌లో పార్టీలు రాజకీయం కాస్త త‌గ్గినా ప్ర‌జ‌ల అంత‌ర్మ‌థ‌నం మాత్రం కొన‌సాగుతూనే ఉంది.
ఆంధ్రావ‌నిలో రాజ‌ధాని రాజ‌కీయం ఆగింది కానీ ఇంకా ఇంకొన్ని విష‌యాల‌పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఓ విధంగా విష‌యం అంతా డైవ‌ర్ట్ అయిపోయి ఉంది. ఇంకా ఆ రోజు అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త విష‌యాల ప్ర‌స్తావ‌న చుట్టూనే రాజ‌కీయం సాగుతోంది. త‌న భార్య‌ను అన‌రాని మాట‌లు అన్నార‌ని, ఇదెంత మాత్రం భావ్యం కాద‌ని బాబు అంత‌ర్మ‌థ‌నం చెందారు. క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఇదే సంద‌ర్భంలో వైసీపీ కూడా త‌న‌దైన కౌంట‌ర్ ఇస్తూనే ఉంది. తాము అన‌ని మాట‌ల‌ను అన్నామ‌ని ఎలా అంటార‌ని అంబ‌టి, కొడాలి వివ‌ర‌ణ ఇస్తూ వ‌స్తున్నారు. అయిన‌ప్ప‌టి స‌భ‌లో మూడు రాజ‌ధానుల బిల్లును ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యంపై కానీ, శాస‌న మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం వెన‌క్కు తీసుకున్న విష‌య‌మై కానీ, సీఆర్డీఏ రద్దు నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకున్న విషయ‌మై కానీ ఇప్పుడెక్క‌డా ఎలాంటి చ‌ర్చ కూడా న‌డ‌వ‌డం లేదు. కేవలం చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త జీవిత విష‌యాల చుట్టూనే రాజ‌కీయం న‌డుస్తోంది. దీంతో ప్ర‌జా స‌మ‌స్య‌ల చ‌ర్చ అన్న‌ది అసెంబ్లీ లోప‌లా బ‌య‌ట అన్న‌ది లేకుండా పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: