తెలంగాణలో కరెంటు కష్టాలు తీరి.. ఇన్నేళ్లు అయిందా..!

MOHAN BABU
తెలంగాణలో 24 గంటల కరెంటుకు ఏడేళ్ళు  పూర్తయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఏర్పడినా రాష్ట్రంలో మాత్రం నిరంతరాయంగా ఏడేళ్ళు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ సామర్థ్యం,కరెంటు పంపిణీ  వ్యవస్థ సరిగ్గా లేక ప్రతిరోజు గంటల కొద్దీ కరెంటు కోతలు ఉండేవి. కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా విద్యుత్ రంగం పైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. అనతికాలంలోనే అన్ని రంగాలకు 24 గంటల కరెంటు అందించి  రికార్డు సృష్టించింది. 24 గంటల విద్యుత్ కోసం పంపిణీ వ్యవస్థ ను మెరుగుపరిచారు. ఏడేళ్లలో  సుమారు 36 వేల  కోట్లు ఖర్చు చేసి 18 వేల మెగావాట్లు సరఫరా చేసే సామర్ధ్యాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో సగటు  తలసరి విద్యుత్ డిమాండ్ 1181 యూనిట్లు ఉండగా, రాష్ట్రంలో 1896 యూనిట్లుగా  ఉంది. ఇతర రాష్ట్రాలు,సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలతో కలిపి ఈ సామర్థ్యం 15 వేల మెగావాట్ల వరకు ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం డిమాండ్ కు తగ్గట్టు విద్యుత్ ని అందించడానికి గాను చతిస్గడ్ రాష్ట్రంతో సహా పలు ప్రైవేట్ సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ప్రభుత్వం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా  అవుతోంది.

రాష్ట్రంలో వినియోగదారులకు, పరిశ్రమలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఏడు సంవత్సరాలు పూర్తి అయినట్లు ఎస్పిడిసిల్  సిఎండి రఘురాం రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు  చెబుతున్నారు. సోలార్ పవర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 70 మెగావాట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 3770 మెగావాట్స్ ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ శాఖ అందిస్తున్న సేవలు కూడా వెలకట్టలేనివి అన్నారు అధికారులు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక సంస్కరణలు చేపట్టినట్లు చెబుతున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ వాహనాలకు అనుగుణంగా ఎస్పీడీసీఎల్ సంస్థ సబ్ స్టేషన్లలో, ఇతర ప్రభుత్వ స్థలాల్లో చార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: