వరదలలో జనం... బురద రాజకీయం... ?

Satya
కాదేదీ కవితకు అనర్హం అని మహా కవి శ్రీశ్రీ అన్నారు. కానీ కాదేదీ రాజకీయానికి ముడి సరుకు అని నేటి రాజకీయం అంటోంది. ఎవరు ఎలా ఉన్నా వారి వర్తమాన స్థితి ఏ విధంగా ఉన్నా రాజకీయం మాత్రం రచ్చ చేయాల్సిందే. దానికి ఎదుటి వారి సాధక బాధలతో అసలు సంబంధం లేదు.
ఏపీలో కానీ దేశంలో కానీ ఇపుడు జరుగుతున్నది ఇదే. తెలంగాణాలో వరి రైతులను మధ్యన పెట్టి రంజు అయిన రాజకీయం చక్కగా చేస్తున్నారు. ఏపీలో చూస్తే చెప్పాల్సిన పని లేదు, ప్రతీదీ రాజకీయమే. వరదలు వచ్చి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాను ముంచెత్తాయి. కనీ వినీ ఎరుగని ప్రళయం అని అంతా అంటున్నారు. యాభై ఏళ్లకు ఒకమారు వచ్చే ఇలాంటి విలయాలను తట్టుకోవడం మానన మాత్రులకు కష్టమే. వైసీపీ మంత్రి కొడాలి నాని సీమ వరదల మీద చెప్పిన విషయాలు వింటే వామ్మో అనిపించకమానదు, కేవలం ఆరు గంటల వ్యవధిలో 32 టీఎంసీల నీరు వానలా వరదలా కురిసిందట. ఆ దెబ్బకు గేట్లు మొత్తం కొట్టుకుపోయాయి.
ఇలా వచ్చి పడిన ప్రళయాన్ని మానవమాత్రుడు ఎవరైనా అడ్డగలరా అని ఆయన అంటున్నారు. ఇక వాటర్ మేనేజ్మెంట్ వైసీపీ వారికి తెలియడంలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. ఇది పూర్తిగా వైసీపీ ప్రభుత్వ తప్పిదమని కూడా ఆయన చెబుతున్నారు. తన హయాంలో తుఫాన్లు వస్తే ప్రాణ నష్టం పెద్దగా లేదని, కానీ వైసీపీ నేతల ఏలుబడిలో మాత్రం ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించడం ప్రభుత్వ అసమర్ధత అంటున్నారు.
ఇలా వరదలతో తమ ప్రాణాలను, సర్వస్వాన్ని కోల్పోయి జనాలు ఉంటే అధికార విపక్ష నేతల రాజకీయం ఇలా ఉంది. ఇంకో వైపు బీజేపీ నేతలు తామేనీ తక్కువ తినలేదు అన్నట్లుగా విమర్శల జోరు పెంచేశారు. ముఖ్యమంత్రి వరద ప్రాంతాలలో పర్యటించకపోవడమేంటని వారు అంటున్నారు. ఇలా పరస్పర విమర్శలు చేసుకోవడమే తప్ప జనాలకు మేలు చేసేవారు లేరని వరద బాధిత జనాలు అనుకుంటున్నారు అంటే నిజంగా బాధాకరమే. మరో వైపు చూస్తే చంద్రబాబు తన విమర్శలను అధికార పార్టీ మీద ఎక్కుపెడుతున్నారు.
ఆయన వరద ప్రాంతాల్లో కూడా తన సతీమణి మీద అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ చెబుతున్నారు. ఇది పూర్తిగా అసందర్భమని ఇపుడు వారికి కావాల్సింది ఓదార్పు కానీ వారిని తమ రాజకీయం కోసం వాడుకోవడం కాదని  వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడానికి కారణం సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగించకూడదనే అని మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. ఇక కేంద్రానికి తక్షణ సాయం కింద వేయి కోట్లు కావాలని ముఖ్యమంత్రి జగన్ లేఖ రాస్తే దాని మీద వారి రియాక్షన్ ఏంటో ఇంకా తెలియలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: