పంజాబ్ కోసం కీలక వ్యూహాలు...!

Podili Ravindranath
దేశంలో సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జరిగే ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. అటు దేశ ప్రజలు కూడా మరో మూడు నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకుంటుందా.... పంజాబ్ అసెంబ్లీని హస్తం మళ్లీ చేయ్యి జారకుండా జాగ్రత్త పడుతుందా... ఉత్తరాఖండ్ ఫలితం ఎలా ఉంటుందో... ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఏడాది పాటు నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు. ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.... చివరికి కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ప్రధాని ప్రకటన వెనుక మెగా ప్లాన్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్లమెంట్‌లో బిల్లులు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు ప్రకటించారు.
పంజాబ్‌లో పరిస్థితులు మారిన పరిణామాలతో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సొంతంగా ఓ పార్టీ కూడా పెడుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ ప్రకటించారు కూడా. అయితే భారతీయ జనతా పార్టీపై సిక్కులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కెప్టెన్ అమరేందర్ భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ ప్రశ్న. తాజాగా వచ్చిన ఏబీపీ - సీ ఓటర్ సర్వే నివేదికలో... పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ కనీసం బోణీ కూడా కొట్టదని నివేదికలో వెల్లడైంది. దీంతో తప్పని పరిస్థితుల్లో కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసింది. ఇక అలాగే సిక్కుల పవిత్ర గురువు గురునానక్ జయంతి సందర్భంగా... పాకిస్తాన్‌లో గురుద్వార దర్శనం కోసం కర్తార్ పూర్ కారిడార్‌ను కూడా కేంద్రం తెరిచింది. సిక్కులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరి చూడాలి... పంజాబ్ ఓటర్లు కమలం నేతలను కరుణిస్తారా... లేక హస్తం పార్టీకి జై కొడతారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: