టమాటాపై కీలక నిర్ణయం తీసుకున్న స్టాలిన్..!
టమాట ధరల కట్టడికి స్టాలిన్ సర్కార్ విస్తృత చర్చలు తీసుకుంది. ప్రభుత్వం నిర్వహించే సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో టమాటా 79 రూపాయలకు అమ్మేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు, పెరిగిన పెట్రో ధరల కారణంగా రవాణా ఛార్జీలు మోత మోగిస్తున్నాయి. ఇక వర్షాల వల్ల టమాట పంట పూర్తిగా నీటి పాలైంది. సరిగ్గా నెల రోజుల క్రితం కిలో టమాట పది రూపాయలు పలికితే... ఇప్పుడు ఏకంగా 200 రూపాయలకు చేరుకుంది. ప్రజల ఇబ్బందులపై తొలి నుంచి తనదైన శైలిలో స్పందిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఇప్పుడు టమాట కొరత తీర్చేందుకు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రతి రోజు 15 మెట్రిక్ టన్నుల టమాటాలను రాష్ట్ర సహకార శాఖ ద్వారా ప్రభుత్వం సేకరిస్తోందని స్టాలిన్ ప్రకటించారు. టమాటా విక్రయం కోసం చెన్నై నగరంలో 40, ఇతర ప్రాంతాల్లో 65 దుకాణాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో బహిరంగ మార్కెట్లో కూడా టమాట ధరలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం చెన్నై నగరంలో కిలో టమాటా వంద నుంచి 120 రూపాయల మధ్య అమ్ముతున్నారు.