బీజేపీ బీజియమ్ : ఎదగడానికి ఎందుకురా తొందర !

RATNA KISHORE
తెలంగాణ రాష్ట్రంలో ఏక వ్య‌క్తి పాల‌న ఏక పార్టీ పాల‌న ఏడేళ్ల‌కు పైగానే సాగుతోంది. పాల‌న ఎలా ఉన్నా కూడా గులాబీ దండులో ఉత్తేజం మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. అదే స‌మ‌యంలో క్షేత్ర స్థాయిలో పార్టీని నిలుపుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలూ ఏ మాత్రం త‌గ్గడం లేదు. గెలుపోట‌ములన్న‌వి దైవాధీనాలు అన్న వేదాంతం ఒక‌టి కేసీఆర్ కొన్ని సంద‌ర్భాల్లో వినిపించినా కూడా తెర వెనుక మాత్రం త‌న వ్యూహాల‌ను అమ‌లుచేసే క్ర‌మంలో యోధుని ల‌క్ష‌ణాల‌నే క‌న‌బ‌రుస్తూ, వ్యూహ చ‌తుర‌త‌ను కూడా త‌న
స‌మ‌ర్థ‌త‌కు జోడించి  రాజ‌కీయం నెర‌పుతున్నారు. ఇదే కేసీఆర్ కు క‌లిసివస్తే, బీజేపీకి అడ్డంకిగా మారింది. ఎంత ప్ర‌య‌త్నించినా కూడా గ్రౌండ్ లెవ‌ల్ లో కేసీఆర్ ను ఢీకొనే నాయ‌కుడు బీజేపీకి దొర‌క‌డం లేదు. డ‌బ్బులుంటే ఏం లాభం కానీ ప‌నిచేసే నాయ‌కుల కొర‌తతో బీజేపీ అధినాయ‌క‌త్వం ఎప్ప‌టి నుంచో ప‌లు త‌ల‌నొప్పులు భ‌రిస్తూనే ఉంది. ఇదే సంద‌ర్భంలో ఇత‌ర పార్టీల నుంచి వ‌స్తున్న సీజ‌న‌ల్ పొలిటీష‌న్ల‌ను తాము ఎలా న‌మ్మేది అని అంత‌ర్మ‌థనం కూడా చెందుతోంది. అందుకే పార్టీ అభివృద్ధి అన్న‌ది అది పెద్ద విష‌యంగానే చూస్తోంది. ఇప్ప‌టికిప్పుడు తెలంగాణ‌లో పాగా వేయ‌లేకున్నా ముందున్న కాలంలో టీఆర్ఎస్ లో చీలిక తీసుకు వ‌చ్చైనా ఈ ప్రాంతంలో అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని ఇంకొంద‌రు వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యం.

తెలంగాణ వాకిట బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించ‌లేక‌పోతోంది. ముఖ్యంగా గులాబీ దండును ఢీ కొనేందుకు అవ‌స‌రం అయిన శ‌క్తీ, యుక్తీ లేక చ‌తికిల‌ప‌డుతోంది. దేశ రాజ‌కీయాల‌నే శాసిస్తున్న బీజేపీకి తెలంగాణ విష‌య‌మై ఏం చేయాలో అంతు చిక్క‌డం లేదు. అంతేకాదు కేసీఆర్ తో ఉన్న స‌ఖ్య‌త కార‌ణంగానే బీజేపీ ఇక్క‌డ త‌న‌దైన రాజ‌కీయం న‌డ‌ప‌లేక‌పోతోంద‌న్న వాద‌న మ‌రియు విమ‌ర్శ కూడా ఉన్నాయి.

పైకి కేసీఆర్ బీజేపీని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టినా లోపల మాత్రం ఆయ‌న త‌న‌దైన శైలిలో లాబీయింగ్ చేసి ఢిల్లీ పెద్ద‌ల‌ను త‌రుచూ ఒప్పిస్తూ వారి మెప్పు కోసం ప్రాకులాడుతున్నారు లేదా కొన్ని విష‌యాలపై త‌న‌కు అనుకూలంగా ప‌నిచేయాల‌ని ప్రాథేయ‌ప‌డుతున్నారు అని కొంద‌రు కాంగ్రెస్ వాదులు  ఆరోపిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అలానే మాట్లాడ‌తున్నారు. ఇందులో వాస్త‌వం ఎంత‌న్న‌ది  బాహాటంగానే అనేక సార్లు నిరూప‌ణ అయింద‌ని కూడా ఆయ‌న ప‌లు సార్లు ప‌లు మీడియా వేదిక‌ల్లో మాట్లాడి తెలంగాణ రాజ‌కీయాల‌ను వేడెక్కించిన వైనం గుర్తుండే ఉంటుంది. అంత స్పీడులో ఉన్న రేవంత్ అయినా, స్పీడు తెచ్చుకునేందుకు తిప్ప‌లు ప‌డుతున్న బీజేపీ అయినా కేసీఆర్ కు స‌రైన స‌మాధానంగా ఎద‌గ‌లేక ప్ర‌శ్న‌గానే మిగిలిపోతున్నాయి.

ఈ క్ర‌మంలోనే బీజేపీ పెద్ద‌లు కూడా పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించ‌లేక, కేసీఆర్ చేయించిన విధంగా భారీ స్థాయిలో స‌భ్య‌త్వ  న‌మోదులు చేయించుకోలేక చాలా అవ‌స్థ ప‌డుతున్నారు ఎప్ప‌టి నుంచో! ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌ల‌కు బీజేపీ అధిష్టానం స‌హ‌క‌రించినా బండి సంజ‌య్ లాంటి లోక‌ల్ లీడ‌ర్లు పెద్ద‌గా చేయూత ఇవ్వ‌డం లేదు అన్న‌ది కూడా ఓ విమ‌ర్శ. ఈటెల కానీ ర‌ఘునంద‌న్ కానీ త‌మ ఇమేజ్ దృష్ట్యానే హుజురాబాద్ లో కానీ దుబ్బాక‌లో కానీ ఆశించిన విజ‌యాలు అందుకున్నార‌న్న‌ది కూడా ఇదే స‌మ‌యంలో సుస్ప‌ష్టం. కానీ టీబీజేపీ బాస్ బండి సంజ‌య్ మాత్రం సంబంధిత విజ‌యాలు అన్నీ కూడా త‌మ పార్టీవేన‌ని, అవి వ్య‌క్తుల విజ‌యాలు కావ‌ని అన్న విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. దేశంలో మోడీ నాయ‌క‌త్వం  న‌చ్చ‌డంతోనే వీరికి ప్ర‌జ‌లు ప‌ట్టం కట్టార‌ని చెబుతూ తెలివిగా ఈటెల ను కానీ ర‌ఘునంద‌న్ కు  కానీ జీరోలను చేసేందుకు తెగ తాపత్ర‌య‌ప‌డుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: