ప‌బ్లిక్ ఫోక‌స్ : స్టాలిన్ పై ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు?

RATNA KISHORE
ఏపీ సీఎం క‌న్నా పొరుగున ఉన్న సీఎం స్టాలిన్ మంచి ప‌నిత‌నంతో దూసుకుపోతున్నారు. కొన్ని విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు ఆయ‌న‌కు గొప్ప పేరు తీసుకువ‌స్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌ద‌ల వేళ  అంతా తానై బాధితుల‌ను ఆదుకున్న వైనం, తానే స్వ‌హ‌స్తాల‌తో బాధితుల‌కు పట్టెడ‌న్నం పెట్టిన వైనం ఇవన్నీ సోష‌ల్ మీడియాలో విస్తృత రీతిలో ప్ర‌చారానికి నోచుకుని ఆ సీఎంపై గౌర‌వాన్ని పెంచాయి. ఇప్పుడు నిన్న‌టి చ‌ర్య‌లకు కొన‌సాగింపుగా ట‌మాట ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై సీఎం స్టాలిన్  తీసుకున్న నిర్ణ‌యంపై అటు త‌మిళ‌నాట ఇటు ఆంధ్రావ‌నిలో గుడ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ దిశ‌గా జ‌గ‌న్ ఎందుకు ఆలోచించ‌రు?
- ట‌మాట విక్ర‌యం స‌హ‌కార శాఖ ప‌రిధిలోకి
తీసుకువ‌చ్చిన వైనం
కేజీ రూ.76కే అమ్మాల‌ని నిర్ణ‌యం
- ఏపీలో వంద‌కు పైగా ధ‌ర ప‌లుకుతున్నా
నియంత్రించే నాథుడే లేడు
అడిగే వారే లేరు..అడిగినా ప‌ట్టించుకునే వారే లేరు. ఇదీ ఆంధ్రావ‌నిలో ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు సంబంధించి ప్ర‌తి నోటా ప్ర‌తి చోటా వినిపిస్తునే ఉన్న మాట. ఉన్న మాట అంటే ఉలుకెందుకు ? అవును కానీ పాల‌క పార్టీకి ఉలికిపాటు కాస్త ఎక్కువ‌గానే ఉంది. ఏ విష‌యంలో అయినా ప్ర‌భుత్వ తీరు ఇలా ఉంది అని ఆధార స‌హితంగా చెప్పామే అనుకోండి వాళ్ల‌కు కోపాలు వ‌స్తున్నాయి. అంతేకాదు అదే సంద‌ర్భంలో కోపం క‌ట్ట‌లు తెచ్చుకుని నానా ర‌భ‌స‌కు కార‌ణం అవుతోంది. ఇదంతా ఎందుకు అంటే రాష్ట్రంలో ఇప్పుడు ధ‌ర‌లు బ‌హిరంగ మార్కెట్లో చుక్క‌లు చూపిస్తున్నాయి. ముఖ్యంగా కార్తీకం వేళ ఈ ధ‌ర‌లు మ‌రీ ఎక్కువ‌గానే ఉన్నాయి.
ట‌మాట, ఉల్లి త‌దిత‌రాల ధ‌ర‌లు సామాన్యుడికి భారంగానే ఉన్నాయి. అయినా కూడా ఏదో ఒక విధంగా కుటుంబాల‌ను నెట్టుకు వ‌స్తూనే ఉన్నామ‌ని అంటున్నాయి సంబంధిత వ‌ర్గాలు. ఈ త‌రుణాన యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చొర‌వ తీసుకుని ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు ఏమ‌యినా చ‌ర్య‌లు చేప‌డ‌తారా అంటే అదేం లేదు అని తేలిపోయింది.
ఇదే సంద‌ర్భంలో పొరుగున ఉన్న సీఎం స్టాలిన్ మాత్రం త‌న‌వంతుగా స‌హకార శాఖ ప‌రిధికి ట‌మాట విక్ర‌యాల‌ను తీసుకువచ్చా రు. ఇప్పుడ‌క్క‌డ కేజీ ట‌మాట ధ‌ర 76 రూపాయ‌లు మాత్రమే! ఈ విధంగా చెన్న‌య్ లోని 40 దుకాణాల్లో ప్ర‌భుత్వ ప‌రిధిలో టమాట విక్ర‌యాల‌ను సంబంధిత అధికారులు చేప‌ట్టి, వినియోగ‌దారుల‌కు కాస్త అందుబాటులో కూర‌గాయల ధ‌ర‌లు ఉండేలా కూడా చ‌ర్య‌లు తీసుకుంటుండ‌డం ఎంతైనా అభినందనీయం. అదేవిధంగా చెన్న‌య్ మ‌హా న‌గ‌రంలోనే కాకుండా న‌గ‌రేత‌ర ప్రాంతాల‌లో కూడా 65 దుకాణాల్లో ట‌మాట విక్రయాలు ప్ర‌భుత్వ‌మే చేప‌ట్ట‌నుంది నిర్ణీత ధ‌ర‌కు! పెట్రో ధ‌ర‌ల విష‌య‌మై రాష్ట్రాల వాటాగా వచ్చే ప‌న్నును ఏపీ తెలంగాణ‌తో పాటు త‌మిళ‌నాడు స‌ర్కారు కూడా త‌గ్గించ‌క‌పోయినా ట‌మాట విక్ర‌యంలో ముఖ్యంగా ప్రభుత్వ ప‌రిధిలో సంబంధిత ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డంతో పొరుగు సీఎం స్టాలిన్ స‌ఫ‌లీకృతం అయ్యార‌నే చెప్పాలి. కానీ మ‌న ద‌గ్గ‌ర ఇందుకు త‌గ్గ చ‌ర్య‌లు ఎప్పుడు చేప‌ట్ట‌నున్నారో జ‌గ‌న్ ! ఆ లోగుట్టు స‌జ్జ‌ల‌కు కానీ పెద్దిరెడ్డి కి కానీ తెలుసా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: