ఆదాయం కోసం జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు....!

Podili Ravindranath
పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. దాదాపు రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... ముందుగా సంక్షేమ పథకాల అమలుపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో... అప్పు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అటు రుణ పరిమితి పెంచాలంటూ ఇప్పటికే ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు కూడా లేఖ రాసింది జగన్ సర్కార్. అదే సమయంలో అప్పు కోసం ప్రభుత్వ భూములను కూడా తాకట్టు పెట్టేసింది. అయితే ఇప్పుడు ఆదాయ మార్గాల వైపు దృష్టి పెట్టింది. ఆదాయం వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం పేదలకు పంచిన భూముల రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ పేరుతో పేదలకు ప్రభుత్వం పంచిన భూముల రిజిస్ట్రేషన్లు చేసే అధికారాలను గ్రామ, వార్డు సెక్రటరీలకు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కూడా. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వం భూములను పంచి ఇచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నుంచి కూడా ఇళ్ల బకాయిలు ఉన్నాయి. అయితే వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టిన జగన్ సర్కార్... వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రస్తుతం అవకాశం కల్పించింది. దీని ద్వారా లబ్దిదారులకు కూడా లాభం జరుగుతుందని.... భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా ప్రభుత్వాధికారులు వెల్లడిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి నిర్ణీత మొత్తంలో డబ్బులు కట్టించుకోవటం ద్వారా ... వారి ఆస్తులను వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. ఇప్పటి వరకు లబ్దిదారులుగా ఉన్న వీరంతా కూడా ఇకపై ప్రభుత్వ హక్కుదారులుగా గుర్తింపు పొందుతారని కూడా అధికారులు వెల్లడించారు. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కింద మూడు ధరలను నిర్ణయించింది ప్రభుత్వం. గ్రామాల్లో 10 వేల రూపాయలు, పట్టణాల్లో 15 వేల రూపాయలు, నగరాల్లో 20 వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా లబ్దిదారులు తమకు కేటాయించిన ఇళ్లను ఇతరులకు విక్రయిస్తే... కొనుగోలు చేసిన వారి నుంచి రెట్టింపు మొత్తం రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేస్తారు. ఈ పథకం ద్వారా కనీసం 5 వేల కోట్ల రూపాయలు సర్కార్ ఖజానాకు జమ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: