మాజీ సీఎం భార్యకు నోటీసులు.. ఇదో రకం శాడిజం..

Deekshitha Reddy
రాజకీయాలు గతంలో నేతల చుట్టూ తిరిగేవి. కానీ ప్రస్తుతం రాజకీయ నేతల భార్యలు, కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడిదే రాజకీయాల్లో నడుస్తున్న లేటెస్ట్ ట్రెండ్. తాజాగా ఓ మాజీ ముఖ్యమంత్రి సతీమణికి జాతీయ పార్టీ నోటీసులు పంపించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. తీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ఇండైరెక్ట్ గా హెచ్చరికలు కూడా చేసింది. వారం రోజుల్లోగా ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఈ నోటీసుల ఎపిసోడ్ పై ఆ మాజీ ముఖ్య మంత్రిగానీ.. ఆయన సతీమణి గానీ ఇంతవరకూ స్పందించకపోవడం విశేషం.
అయితే ఇంతకీ ఆ మాజీ ముఖ్య మంత్రి ఎవరో తెలుసా.. పంజాబ్ కు చెందిన అమరీందర్ సింగ్. అవునండీ.. మొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అమరీందర్ సింగ్ ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన భార్య పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. భర్త పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆమె మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోంది. అయితే గతకొద్ది రోజులుగా ఆమెపై మిగిలిన కాంగ్రెస్ పార్టీని నేతలు అధిష్టానానికి పిర్యాదు చేశారట. దీంతో అధిష్టానం ఆమెకు నోటీసులు పంపింది. వివరణ ఇవ్వాలని వారం రోజుల గడువు కూడా పెట్టేసింది. అయితే ఇలా నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన కారణం మాత్రం ఆమెను పార్టీ నుంచి బయటకు పంపడానికేనని సమాచారం.
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. బీజేపీతో కలసి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి కూడా అమరీందర్ సతీమణి ప్రణీత్ కౌర్ ఆయనకు సహకరిస్తోందని.. మిగిలిన కాంగ్రెస్ నేతలంతా గుసగుస లాడుకుంటున్నారు. ఈ గుసగుసలు కాస్తా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ హరీష్ చౌదరి చెవిన పడటంతో ఆయన నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నోటీసులపై ప్రణీత్ కౌర్ స్పందిస్తారో లేక, ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో సంధి మార్గం కుదుర్చుకుంటారో తెలియదు గానీ.. నోటీసుల విషయం మాత్రం పంజాబ్ లో చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: