గుడ్‌ న్యూస్.. ఇండియాలో థర్డ్‌వేవ్‌కు నో ఛాన్స్..?

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారి ఇప్పటికే రెండు విడతలుగా ఇండియాను అల్లాడించింది. దీని చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ మన మనసుల్లో పీడకలల్లా గుర్తొస్తూనే ఉన్నాయి. అయితే.. కరోనా కథ ఇక్కడితో అయిపోలేదు.. ఇంకా మూడోవేవ్ కూడా ఉందని కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో థర్డ్ వేవ్ తప్పదని అప్పట్లో కొందరు నిపుణులు హెచ్చరించారు. అయితే.. అదృష్టవశాత్తూ ఆ ఇబ్బంది ఎదురు కాలేదు. అయితే.. మరి ఇండియాకు మూడో ముప్పు తొలగిపోయినట్టేనా.. లేక.. ఆలస్యంగానైనా మూడో ముప్పు పొంచి ఉందా.. అన్న అనుమానాలు తొలగిపోలేదు.

ఎందుకంటే.. ఇప్పుడు యూరప్‌ దేశాలను కరోనా మళ్లీ వణికిస్తోంది. అక్కడ ఆస్పత్రులన్నీ మళ్లీ నిండిపోతున్నాయి. కరోనా రెండు డోసులు తీసుకున్నా అక్కడ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి ఇండియాలోనూ మళ్లీ అలాంటి దృశ్యాలు తప్పవా అన్న ఆందోళన ఉంది. దీని గురించి తాజాగా చెన్నై శాస్త్రవేత్తలు చెబుతున్న లెక్కలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. వారు ఏం చెబుతున్నారంటే.. హైబ్రిడ్‌ రోగ నిరోధక శక్తి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగడం తదితర కారణాలతో భారత్‌లో కొవిడ్‌ మూడో దశ ముప్పు ఎక్కువగా ఉండకపోవచ్చట.

అంతే కాదు.. ఇండియాలో కరోనా మూడో దశ సెప్టెంబర్ మధ్యలోనే వచ్చిందట. అది మనం గుర్తించలేని స్వల్ప స్థాయిలో ఉందట. అయితే. డిసెంబర్‌, ఫిబ్రవరి నెలల మధ్య దేశంలో కరోనా కేసుల సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉందంటున్నారు మరికొందరు నిపుణులు. అయితే దాని ప్రభావం ప్రజలపై అంతగా ఉండదట. కొవిడ్‌ రెండో దశలోనే అనేక మంది కరోనా బారినపడ్డారు కాబట్టి.. అలాంటి వారిలో వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరిగిందట.

దీంతో పాటు ఎలాగూ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అందువల్ల ఇండియాలో ఇక వైరస్‌ వ్యాప్తి అంతగా ఉండకపోవచ్చని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఇండియాలో కేసులు మరీ బాగా తగ్గాయి.  543 రోజుల కనిష్ఠానికి చేరాయి. సో.. ఇక ఇండియాలో మూడో ముప్పు లేనట్టే అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: