ముద్రగడ..జగన్‌ని ఇరికిస్తున్నారా?

M N Amaleswara rao
ముద్రగడ పద్మనాభం...మాజీ కాపు ఉద్యమ నేత. ఎందుకంటే ఇప్పుడు కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాటం చేయడం లేదు. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని ఎప్పుడో ప్రకటించేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఉండగా ముద్రగడ ఎలాంటి పోరాటాలు చేశారో అందరికీ తెలిసిందే. కాపు రిజర్వేషన్ల కోసం కంచాలని..చెంచాలు పట్టుకుని మరీ మోగించారు. నిత్యం చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే వచ్చారు.
అయితే అప్పుడు ముద్రగడ కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారో లేక జగన్ కోసం పరోక్షంగా పనిచేస్తున్నారో పూర్తిగా ఎవరికి అర్ధమయ్యేది కాదు. అంతలా ముద్రగడ రాజకీయం ఉండేది. కానీ ఎక్కువశాతం ఈయన కాపుల కోసం ఏదో పోరాటం చేస్తున్నట్లే కనిపించేది. ఇదంతా చంద్రబాబు అధికారంలో ఉండగానే...జగన్ అధికారంలోకి రాగానే ఈయన పోరాటం ఆగిపోయింది. అలా అని చెప్పి ముద్రగడ పోరాటానికి ఫలితం ఏమి రాలేదు. పైగా కాపు రిజర్వేషన్ల అంశం ఇంకా వెనక్కి వెళ్లింది. ఇలాంటి సమయంలో ముద్రగడ ఉద్యమం నుంచి తప్పుకున్నారు.
ఆఖరికి కేంద్రం అగ్రవర్గాల పేదలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో చంద్రబాబు 5 శాతం కాపులకు ఇచ్చారు. కానీ జగన్ వచ్చాక అది కూడా పోయింది. అయినా సరే ముద్రగడ సైలెంట్‌గానే ఉన్నారు. కానీ తాజాగా చంద్రబాబు..వైసీపీ నేతలు తన భార్య భువనేశ్వరిని కించపరిచేలా మాట్లాడారని కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ..తనని చంద్రబాబు ప్రభుత్వం ముప్పు తిప్పలుపెట్టిందని, తమ ఫ్యామిలీని టీడీపీ నేతలు బూతులు తిట్టారని, పోలీసులతో హింసించారని, ఆ వేధింపులు భరించలేక తన ఫ్యామిలీతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని చూశామని, కానీ చంద్రబాబు పతనం చూడటానికి ఆ ఆలోచన విరమించుకున్నానని ముద్రగడ చెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో గానీ... పరోక్షంగా కాపుల కోసం కాకుండా చంద్రబాబుని రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికి ముద్రగడ పనిచేశారని అర్ధమవుతుంది. అంటే జగన్ కోసం అప్పుడు ముద్రగడ గట్టిగానే పనిచేశారని తెలుస్తోంది. ఇప్పుడు నిజాలు బయటపెట్టి, జగన్‌ని కూడా ఇరికించేలా ముద్రగడ లేఖ ఉందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: