ఒక్కసారిగా పెరిగిన టీడీపీ గ్రాఫ్... ?

Satya
ఏపీలో రాజకీయం మారుతోందా. గాలి ఇపుడు ఒక్కసారిగా వేరే వైపునకు మళ్ళుతోందా అంటే జవాబు మాత్రం అవును అనే వస్తోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న వైసీపీకి ప్రతిపక్ష టీడీపీకి మధ్య రాజకీయ యుద్ధం భీకరంగా సాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రతీసారీ టీడీపీ ఓడిపోతోంది. వైసీపీకి గత రెండున్నరేళ్లుగా జనం మద్దతుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల నుంచి ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఇలా ఏం జరిగినా వైసీపీనే గెలిపిస్తూ వచ్చారు. అయితే ఏపీలో జగన్ సర్కార్ ప్రతీ సారీ సెల్ఫ్ గోల్ వేసుకుంటోంది. పైగా పాలకులు మితిమీరిన ధీమాతో ఉండడం కూడా ఇపుడు జనాల్లో చర్చగా ఉంది. లేకపోతే ఇలాంటి సీన్లు ఇంతకు ముందు ఎవరైనా చూశారా. ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనాల్లోకి వెళ్తే వరద బాధితులు ఆయన మీద మండిపడ్డారు.
ఇపుడా రావడం అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇక నెల్లూరులో మరో మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి ఇదే అనుభవం ఎదురైంది. ఆయన కూడా జనాల కోపానికి గురి అయ్యారు. వీరే కాదు, చాలా మంది మంత్రులు ప్రజా ప్రతినిధులు ఇదే రకంగా జనంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక సర్వం కోల్పోయి జనాలు ఉన్నారు. ప్రభుత్వం చేసిన సాయం ఏ మూలకూ స‌రిపోదు, కనీసం ఓదార్పు ఇవ్వడానికి కూడా ఏం పోయిందో కానీ  వైసీపీ పెద్దలు బయటకు  రావడంలేదు.
దానికి తోడు టీడీపీ జనాల్లోకి వెళ్తోంది. చంద్రబాబు అయితే వరద జిల్లాల్లో టూర్లు చేస్తున్నారు. జనాలలో ఆయనకు ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. ఆయన సభలకు జనం బాగా వస్తున్నారు. ఇంకో వైపు చూసుకుంటే మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేయడం,  శాసన మండలిని ఒకసారి రద్దు అంటూ మరో సారి కావాలని కోరుకోవడం వంటివి చర్చకు వస్తున్నాయి.
అభివృద్ధి మీద కూడా చర్చ సాగుతోంది. ఇప్పటిదాకా జనం జగన్ తీసుకునే నిర్ణయాల వెనక లాజిక్ ఉందని భావించే వారు. ఇపుడు ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటూ యూ టర్న్ తీసుకుంటూ తమ వైఖరి చెప్పేసుకుంటోంది. దీని మీద చంద్రబాబు లాంటి వారు పాలన చేతకాకనే ఇలా చేస్తున్నారు అని విమర్శలు చేస్తే జనాలు నమ్మే సీన్ ఉంది. మొత్తానికి చంద్రబాబు ఏ ముహూర్తాన కన్నీరు పెట్టారో కానీ మెల్లగా గాలి అయితే టీడీపీ వైపు గా వీస్తోంది అంటున్నారు. చూడాలి మరి దీనికి వైసీపీ కౌంటర్ ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: