రెండు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం....!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. పేరుకు ప్రతిపక్షం సభలో లేకపోయినా కూడా... సభ జరుగుతున్న తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లో రెండు కీలక బిల్లులను రద్దు చేసింది వైఎస్ జగన్ సర్కార్. మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు, శాసన మండలి రద్దు బిల్లులను అసెంబ్లీలో ఉప సంహరించుకుంది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు మరో రెండు కీలక బిల్లులను కూడా సభ ఆమోదం తెలిపింది. ఇందులో ఒకటి సినిమా పరిశ్రమకు చెందిన అంశం కాగా... మరొకటి ప్రజలపై పన్నుల భారం వేసే బిల్లు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు, మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లులకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. సినిమా టికెట్ల విక్రయం విషయంలో రాష్ట్రంలో కొద్ది రోజులుగా పెద్ద దుమారమే నడుస్తోంది. సినిమా విడుదలైన ప్రతిసారి టికెట్ ధరలు ఇష్టానుసారం పెంచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేపట్టిన జగన్ సర్కార్.. ఈ రోజు సభలో ఈ బిల్లు ఆమోదం పొందేలా చేసింది.
రాష్ట్రంలో ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించేందుకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి పేర్ని నాని సభకు వివరించారు. సినిమా థియేటర్లతో రోజుకు నాలుగు షోలు మాత్రమే వేసేందుకు అనుమతి పొందిన ఎగ్జిబీటర్లు... ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రిలీజు రోజున ఆరు, ఏడు షోలు కూడా వేస్తున్నారని... అయితే ప్రభుత్వానికి పన్ను మాత్రం కేవలం నాలుగు షోలకు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఇక టికెట్లు కూడా బెనిఫిట్ షోల పేరుతో 500 నుంచి వెయ్యి రూపాయల వరకు టికెట్లు విక్రయించి ప్రేక్షకుల జేబులకు చిల్లు పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం సినిమా హాళ్లలో జరుగుతున్న అక్రమాలకు ఆన్ లైన్ టికెట్ ప్రక్రియ మాత్రమే అడ్డుకట్ట వేస్తుందని ప్రభుత్వం భావించినట్లు పేర్ని నాని వెల్లడించారు. ఇదే విషయంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా సూచించారన్నారు. దీంతో సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేసినట్లు పేర్ని నాని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: