అమరావతిపై జగన్ స్టాండ్ ఏమిటో...!

Podili Ravindranath
అమరావతి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా సుదీర్ఘ పరిశీలన, కమిటీల పర్యటన తర్వాత అమరావతి నగరాన్ని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంపిక చేసింది. దీని కోసం ప్రభుత్వం ఓ మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసింది. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంల 33 వేల ఎకరాలను సేకరించింది. అక్కడ కొన్ని భవనాల నిర్మాణం కూడా చేసింది. పరిపాలన కోసం తాత్కాలిక శాసనసభ, హైకోర్టు, సచివాలయం ఏర్పాటు చేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఇక శాశ్వత భవనాల కోసం కొన్ని పనులు కూడా ప్రారంభించింది. అయితే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి వైసీపీ నేతలు దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని కూడా ఆరోపించారు. అటు జగన్ సర్కార్ కూడా మొదటి నుంచి సంపూర్ణంగా మద్దతు ఎప్పుడూ ఇవ్వలేదు. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అంగీకరిస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించిన జగన్... శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రం దూరంగా ఉన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో భూ కుంభకోణం జరిగిందని ఆరోపించిన వైసీపీ... సీబీసీఐడీ ద్వారా విచారణ జరిపించింది. దీనిపై హైకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చివరికి రైతుల పాదయాత్రకు కూడా అనుమతి ఇచ్చేందుకు కాస్త వెనుకడుగు వేసిందనే అపవాదు కూడా మూటగట్టుకుంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లును రద్దు చేసిన తర్వాత జగన్ సర్కార్.... ఇప్పుడు అమరావతి రాజధానిపై కొత్త మాట మాట్లాడుతోంది. అమరావతి రాజధానిగా ప్రస్తుతం జగన్ సర్కార్ తప్పని పరిస్థితుల్లో ఒప్పుకుంది. అయితే రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రసంగం చేసిన వైఎస్ జగన్... అమరావతి రాజధానిపై కొత్త మాట మాట్లాడారు. తమకు అమరావతి అంటే ఏ మాత్రం వ్యతిరేకత లేదన్నారు. అయితే ఇప్పుడు కొత్త రాజధాని నిర్మించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు జగన్. రాజధాని నిర్మించాలంటే... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకంగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయన్నారు జగన్. రాజధాని కోసం 50 ఎకరాలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రతి ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇంత ఖర్చు భరించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: