హుజూరాబాద్‌లో గెలిస్తే.. టీఆర్‌ఎస్‌కు కొత్త తలనొప్పి ?

Chakravarthi Kalyan
హుజూరాబాద్‌ ఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ పోరాడుతున్నాయి. అయితే.. హజూరాబాద్ గెలుపుపై ఏ పార్టీకీ ధీమా లేకుండాపోయింది. బలమైన అభ్యర్థి కావడంతో ఈటల రాజేందర్ పై గెలుపు కోసం టీఆర్ఎస్‌ చెమటోడ్చాల్సి వస్తోంది. హుజూరాబాద్‌లో గెలుపు కోసం టీఆర్ ఎస్ చేయని ప్రయత్నం, వేయని ఎత్తుగడ లేదు. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ గెలుపుపై టీఆర్ఎస్‌ కే పూర్తి నమ్మకం లేదు.

ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే.. హుజూరాబాద్‌లో గెలవడం టీఆర్‌ఎస్‌ కు చాలా ప్రతిష్టాత్మకం.. దీన్ని కాదనలేం.. కానీ.. అదే సమయంలో హుజూరాబాద్‌లో గెలిస్తే టీఆర్‌ఎస్‌కు మరో తలనొప్పి ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అదేటంటే.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. బీజేపీ అనేది కాంగ్రెస్‌ తర్వాత స్థానంలోనే ఉంది. హుజూరాబాద్‌లో బీజేపీని టీఆర్‌ఎస్ ఓడిస్తే... బీజేపీకి అది పెద్ద దెబ్బ అవుతుంది. ఈటల వంటి బలమైన క్యాండిటేట్ కూడా ఓడిపోవడం ఆ పార్టీని నైతికంగా దెబ్బతీస్తుంది.

హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. అది పరోక్షంగా కాంగ్రెస్‌కు కూడా లాభం చేకూరుస్తుంది. రాష్ట్రంలో టీఆఎర్ఎస్‌కు ప్రధాన ప్రత్యామ్నాయం తానేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది టీఆర్ఎస్‌కూ బీజేపీ రెండింటికీ మంచిది కాదు. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ సమఉజ్జీలుగా ఎదిగితేనే అధికార పార్టీగా టీఆర్ఎస్‌కు లాభయదాయకం అవుతుంది. అప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు సమంగా చీలి.. అంతిమంగా అది టీఆర్ఎస్‌ లాభదాయకం అవుతుంది.

ఒకవేళ  హుజూరాబాద్‌లో బీజేపీ ఓడిపోతే.. రాష్ట్రంలో బీజేపీ పనైపోయందన్న వాదన వస్తుంది.. గతంలో ఏదో నాలుగు సీట్లు వచ్చాయి.. ఇక ఇప్పుడు అవి కూడా లేదన్న వాదన వస్తుంది. దీనివల్ల బీజేపీ బలహీన పడుతుంది. తద్వారా కాంగ్రెస్ బలపడుతుంది. కాంగ్రెస్ బలపడటం అన్నది టీఆర్‌ఎస్‌కు ఎప్పటికీ మంచిది కాదు. అందుకే హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలిచినా.. దానికి కాంగ్రెస్ నుంచి తలనొప్పి తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: