నారాయ‌ణపేట జిల్లాలో జింక‌ల బెడ‌ద..!

N ANJANEYULU
తెలంగాణ‌లోని నారాయ‌ణ‌పేట జిల్లాలో జింక‌ల పేరు వింటేనే రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. పంట‌ల‌ను తీవ్రంగా ధ్వంసం చేస్తుండ‌డంతో న‌ష్ట‌పోతున్నారు. ఈ జిల్లాలో ప్ర‌తీ ఏడాది ఇదే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నామ‌ని పేర్కొంటున్నారు రైతులు. జిల్లాలో అత్య‌ధికంగా ఖ‌రీఫ్‌లో ప‌త్తి పంట వేశారు. దీనితో పాటు వేరుశ‌న‌గ‌, మొక్క‌జొన్న‌, కంది, ఉల్లి, మిర‌ప వంటి పంట‌లు సాగుచేస్తున్నారు. అప్పులు తెచ్చి సాగు చేస్తున్న పంట‌చేల‌ను కృష్ణ‌జింక‌లు నాశ‌నం చేస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తీ ఏటా ఎంతో న‌ష్టం జ‌రుగుతొంద‌ని వెల్ల‌డిస్తున్నారు.
ముఖ్యంగా జిల్లాలోని నారాయ‌ణపేట జిల్లా మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని న‌ర్వ‌, మాగ‌నూర్‌, మ‌క్త‌ల్‌, ఊట్కూర్‌, కృష్ణా మండ‌లాల్లో జింక‌లు అన్న‌దాత‌ల‌కు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. పొలాల్లో చెంగు చెంగున ఎగురుతూ పంట చేనుకు తీవ్ర‌న‌ష్టం క‌లిగిస్తున్నాయి. ఈ ఏడాది స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వ‌డంతో రైతులు పంట సాగు చేశారు. వేల‌ల్లో పెట్టుబ‌డులు పెట్టారు. అయితే పంట‌లు మొల‌క ద‌శ‌లో ఉన్న‌ప్పుడే దాడి చేశాయి. మ‌ర‌ల పంట పండే స‌మ‌యంలో కూడ దాడి చేస్తున్నాయి. ఇవ‌న్నీ కృష్ణాన‌ది ప‌రివాహ‌క ప్రాంతాలు కావ‌డంతో ఇక్క‌డ జింక‌ల సంచారం ఎక్కువ‌గా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే అడ‌విపందులు, ప‌శువుల నుంచి పంట‌ను కాపాడుకుంటుంటే మ‌రోవైపు జింక‌ల భ‌యం ఎక్కువ‌వుతుంది.
కృష్ణ ప‌రివాహ‌క ప్రాంతం కావ‌డంతో అందులో మైదానాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో జింక‌ల సంచారం కూడ ఎక్కువైంది. ఒక్కో మంద‌లో దాదాపు 50 వ‌ర‌కు జింక‌లు రాత్రి స‌మ‌యంలో పొలాల‌పై ప‌డుతున్నాయి. ఇటీవ‌ల అట‌వీశాఖ అధికారులు నిర్వ‌హించిన స‌ర్వేలో దాదాపు కృష్ణాన‌ది పరివాహ‌క ప్రాంతాల్లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌లిపి 11వేల‌కు పైగా జింక‌లున్న‌ట్టు తెలిసింది. జింక‌ల నుంచి పంట రక్షించుకోవ‌డానికి రైతులు అద‌నంగా ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప‌ర్యావ‌ర‌ణ శాస్త్ర సాంకేతిక ద్వితీయ విభాగం పేరుతో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం 2011 ఆగ‌స్టు 1న జీవో నెంబ‌ర్ 90ని ప్ర‌వేశ‌పెట్టింది. పంట న‌ష్టం జ‌రిగిన‌ప్పుడు అట‌వీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. ఆత‌రువాత వ్య‌వ‌సాయ‌, రెవెన్యూ, అట‌వీశాఖ అధికారుల స‌మ‌క్షంలో ఫోటోలు తీయించాలి. దీనిపై వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌శాఖ అధికారులు పంట న‌ష్టాన్ని బ‌ట్టి అంచెనా వేసి ప్ర‌భుత్వానికి నివేదిక అంద‌జేస్తే ప‌రిహారం మంజూర‌వుతుంది. కానీ అది అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. కృష్ణ‌జింక‌ల స‌మ‌స్య‌పై 2006లోనే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ బ్లాక్‌బ‌క్‌ను ఏర్పాటు చేసింది. దీనికోసం రూ.6కోట్లు ఖ‌ర్చు చేసి జింక‌ల‌ను ప‌ట్టుకొని న‌ల్ల‌మ‌ల‌లో వ‌దిలేశారు. ఈ ఆప‌రేష‌న్ కేవ‌లం ఆ ఒక్క ఏడాదితోనే ఆగిపోయిన‌ది.  ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి జింక‌ల ముప్పు నుంచి త‌ప్పించాల‌ని రైతులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: