జ‌గ‌న్ అనుకుందే జ‌రుగుతోందా.. కొంప మునుగుతోందా...!

VUYYURU SUBHASH
ఏపీలో పాల‌న ఎలా ఉంది? అని ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు చ‌ర్చించుకున్నా.. మొద‌ట సీఎం జ‌గ‌న్ బాగానే చేస్తున్నాడు.. కానీ, మా ఎమ్మెల్యేనే మాకు క‌నిపించ‌డం లేదు! అనే విష‌యం వెలుగు చూస్తోంది. దీనిపై కొన్నాళ్లుగా చ‌ర్చ బాగానే జ‌రుగుతోంది. కొంద‌రు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉన్నా.. ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉంటున్నారు. మ‌రికొంద‌రు.. నియోజ‌క‌వ‌ర్గానికి, ప్ర‌జ‌ల‌కు కూడా దూరంగానే ఉంటున్నారు. దీంతో ప‌రిస్థితి ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా మారిపోతోంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిపై త‌ర‌చుగా.. సోష‌ల్ మీడియాలోను.. వివిధ వెబ్ సైట్ల‌లోనూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు తాజాగా ఐఏఎన్ ఎస్‌-సీ ఓట‌రు స‌ర్వే కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది.
ఏటా దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్య‌మంత్రుల ప‌నితీరు.. ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు?  ఎమ్మెల్యేల ప‌నితీరు.. వారు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారా?  లేదా..? త‌మ ఎమ్మెల్యేల గురించి ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు..?  ఇప్పుడు ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా ఉంది? అనే అనేక అంశాల‌పై సీ ఓట‌రు స‌ర్వే చేస్తుంది. గ‌త ఏడాది చేసిన స‌ర్వేలో ఏపీ ఎమ్మెల్యేల విష‌యంలో ప్ర‌జ‌లు సానుకూలంగానే ఉన్నార‌ని.. 50ః50 అన్న‌ట్టుగా ప‌రిస్థితి ఉంద‌ని తేల్చిన స‌ర్వే.. తాజాగా విడుద‌ల చేసిన స‌ర్వేలో మాత్రం దేశంలో ఎమ్మెల్యేల‌పై అత్య‌ధిక ఆగ్ర‌హంతో ఉన్న రాష్ట్రం ఏపీనేన‌ని స్ప‌ష్టం చేసింది.
ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారంటూ.. మార్కులు కూడా ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రిపై మాత్రం.. ప్ర‌జ‌లు సానుకూల దృక్ఫ‌థంతో ఉన్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు సంక్షేమాన్ని అందిస్తున్నార‌ని.. వివిధ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌ర్వే పేర్కొంది. అదేస‌మయంలో ఎమ్మెల్యేల విష‌యంలో మాత్రం.. వారు అసలు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండ‌డం లేద‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఒక‌రిద్దు ఎమ్మెల్యేలు అయితే.. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌ను క‌లిసిన పాపాన పోలేద‌ని.. కూడా నివేదిక వివ‌రించ‌డం గ‌మ‌నార్హం.
ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి దారుణంగా త‌యార‌వుతుంద‌ని కూడా స‌ర్వే హెచ్చ‌రించింది. నిజానికి ఈ త‌ర‌హా .. అంచ‌నా కొన్నాళ్లుగా సీఎం జ‌గ‌న్ కూడా వేసుకున్నారు. ఎమ్మెల్యేలను ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని కోరుతున్నారు. అయినా.. ఎవ‌రూ పెద్ద‌గా ఆయ‌న మాట‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పుడు స‌ర్వే ఫ‌లితం వ‌చ్చిన ద‌రిమిలా.. ఏం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: