దిగివచ్చిన జొమాటో... తమిళనాడు కోసం కీలక నిర్ణయం...!

Podili Ravindranath
తమిళుల దెబ్బకు దేశ రాజకీయాలు మారిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ... ఏదైనా సమస్య వస్తే మాత్రం.... తమిళులు అంతా ఏక తాటిపైకి వస్తారు. ఇదే విషయం ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా. జల్లికట్టు విషయం అయితేనేం... నీట్ పరీక్ష రద్దు విషయం కానీ... తమిళ భాషా పరిరక్షణ అంశం అయినా సరే... ఇలా సమస్య ఏదైనా పార్టీలు, నేతలు, ప్రముఖులు... ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఏకతాటిపైకి  వస్తారు. రాష్ట్రం కోసం ముక్తకంఠంతో నినాదం చేస్తారు. తమిళులకు ఉన్నంత భాషాభిమానం మరెక్కడ ఉండదంటే... అతిశయోక్తి కాదు. నిజమే... తమిళ భాష విషయంలో ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే... వాళ్లు ఎంత పెద్ద వారైనా సరే... వారితో క్షమాపణ చెప్పించుకునేంత వరకు వెనక్కి తగ్గరు. అది వ్యక్తి అయినా, కేంద్రమైనా, కార్పోరేట్ సంస్థ అయినా..... మరేదైనా సరే.... తగ్గేదే లే అనేస్తారు తమిళులు.
ఇదే విషయం తాజాగా మరోసారి రుజువైంది. తమిళుల దెబ్బకు ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో దిగి వచ్చింది. బాబోయ్ మమ్మల్ని క్షమించండి అనేస్తోంది. తమిళనాడులో ఉంటే మాత్రం జాతీయ భాష హిందీ రావాల్సిందే అంటూ సంస్థ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ తమిళ వినియోగదారుడికి జొమాటో ఎగ్జిక్యూటివ్  చెప్పిన సమాధానం... చివరికి ఆ సంస్థ వ్యాపారంపైనే దెబ్బ కొట్టింది. రిజెక్ట్ జొమాటో అంటూ సోషల్ మీడియాలో కస్టమర్ చేసిన పోస్ట్ తెగ ట్రెండ్ అయ్యింది. హిందీ జాతీయ భాష కాదన్న విషయం జొమాటో సంస్థకు తెలియదా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. వికాస్ అనే వినియోగాదారుడు పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. జొమాటోలో ఆర్డర్ చేయాలంటే హిందీ రావాలా అని ప్రశ్నించారు వికాస్. దీంతో తమిళనాడు వ్యాప్తంగా జొమాటో సంస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఫుడ్ డెలివరీ కంపెనీ కస్టమర్ సర్వీస్ సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పుకు ఆ సంస్థ క్షమాపణ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: