కేసీఆర్ ఉపరాష్ట్రపతి అవుతున్నారా..? దీనిపై కేటీఆర్ స్పందన ఇది..!

NAGARJUNA NAKKA
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపరాష్ట్రపతి కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం సందర్భాన్ని బట్టి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక కొడంగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానన్న రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇక హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈటల రాజేందర్ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని.. కొంతకాలం తర్వాత ఈటలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పారు. వివేక్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఎవరెన్ని చేసినా టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ లో భట్టి విక్రమార్క మంచి వ్యక్తి అని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ ఆ పార్టీలో భట్టిది నడవడం లేదని.. గట్టి అక్రమార్కులదే నడుస్తోందని చెప్పారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డినే ఓడించాం.. ఈటల అంతకంటే పెద్ద లీడరా..?  అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి ఈటల పదవిలోనే ఉన్నారని.. ఎక్కడ అన్యాయం జరిగిందని ప్రశ్నించారు. ఈటల రాజీనామా చేస్తే దళిత బంధు రాలేదనీ.. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే వచ్చిందని తెలిపారు.
ఇక వరంగల్ విజయగర్జన సభ కోసం భారీగా ఆర్టీసీ బస్సులు తీసుకుంటున్నామని.. నవంబర్ 15న ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టి 20ఏళ్లు అవుతున్నందున దిదశాబ్ధి వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక తాను హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్, దుబ్బాక ఎన్నికల ప్రచారాలకు కూడా వెళ్లలేదని గుర్తు చేశారు. చూద్దాం.. ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఏ విధంగా ఉండబోతుందో..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: