టీడీపీ వర్సెస్ వైసీపీ... రాజుకుంటున్న రాజకీయం..!

Podili Ravindranath
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. నిన్నటి వరకు మాటలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కానీ ఇప్పుడు అవి కాస్తా భౌతిక దాడుల వరకు వెళ్లాయి. గతంలో పరిస్థితికి ఇప్పటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సర్వ సాధారణం. వాటికి అధికార పార్టీ నేతలు కూడా సమాధానం ఇచ్చే వాళ్లు. అవి కాస్త హద్దులు మీరాయి. ఇప్పుడు ఒకరిపై మరొకరు నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయాలపైనే దాడులు చేసే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. పట్టాభి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడికి యత్నించారు. అన్నింటికంటే ముందుగా పార్టీ రాష్ట్ర కార్యాలయంపైనే దాడి చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ఇప్పటి వరకు కేవలం మాటలకే పరిమితం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు... ఇప్పుడు భౌతిక దాడులకు తెరలేపింది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వారికి కొట్టారు. రాళ్లతో అద్దాలు ధ్వంసం చేశారు. ఇక వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటిపై దాడి చూస్తే... బాబోయ్ అనేలా ఉంది. కార్లు ధ్వంసం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పార్టీ కార్యాలయాలపై కూడా ఇదే పరిస్థితి. ఫర్నిచర్, సామాగ్రి పగుల గొట్టారు. అడ్డువచ్చిన వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇక బూతు మాటల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు అన్నట్లుగా ఉంది. ఎంతో హుందాగా ఉండాల్సిన రాజకీయాలు కాస్తా.... సినిమాల్లో చెప్పినట్లుగా బురదలా మారిపోయాయి. మాటకు మాట సమాధానం కావాలి తప్ప... దాడి చేయటం ఎంత వరకు సమంజసం అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అదే సమయంలో ఆ మాట కూడా అదుపులోనే ఉండాలని సూచిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జరిగిన బహిరంగ సభలో అప్పటి ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని నడిరొడ్డుపై కాల్చి చంపాలంటూ చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP

సంబంధిత వార్తలు: