పోలింగ్‌ శాతం పెరిగితే లాభమెవరికి? నష్టమెవరికి?

N.Hari
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన హుజురాబాద్‌ ఉపఎన్నికలో పోలింగ్‌ శాతం పెరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ జరుగుతోంది. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని ఓటర్ల ఫైనల్‌ లిస్టును ఎన్నికల అధికారులు ప్రకటించడంతో.. ఈ చర్చ మరింత జోరందుకుంది. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 2,36,873 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 1,17,779 మంది ఉండగా... మహిళలు 1,19,093 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 1314 మంది ఎక్కువగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో 10 వేల వరకు కొత్త ఓట్లు నమోదు అయ్యాయి.
2018 ఎన్నిక‌ల సంద‌ర్భంగా హుజురాబాద్‌లో 2,26,000 పైచిలుకు ఓట్లు ఉండేవి. తాజాగా ఉపఎన్నిక జరుగుతున్న నేప‌థ్యంలో కొత్త‌గా నమోదు చేసుకున్నవారికి ఓటు హ‌క్కు క‌ల్పించారు. దీంతో ప‌ది వేల ఓట్లు పెరిగి... ఆ సంఖ్య ఇప్పుడు 2,36,873కు చేరింది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఐదు మండ‌లాలున్నాయి. కొత్త‌గా ఏర్ప‌డిన ఇల్లంతకుంట మండ‌లంలో మిగ‌తా మండ‌లాల కంటే త‌క్కువ ఓట్లు ఉన్నాయి. ఈ మండ‌లంలో కేవ‌లం 24,799 మంది ఉండ‌గా.. అత్య‌ధికంగా హుజురాబాద్ మండ‌లంలో 61,673 ఓట్లు ఉన్నాయి.
హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక ఈ నెల 30 న జ‌ర‌గ‌నుంది. ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను న‌వంబ‌ర్ 2వ తేదీన విడుద‌ల కానున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను టీఆర్ఎస్ , బీజేపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. తాజాగా ఎన్నిక‌ల సంఘం 80 సంవ‌త్స‌రాలు పై బ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని క‌ల్పించింది. అలాగే విక‌లాంగులు కూడా పోస్ట‌ల్ బ్యాలెట్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు 822 మంది ఓట‌ర్లు పోస్ట‌ల్ బ్యాలెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికంగా ద‌ళితుల‌వి 45 వేల పైచిలుకు ఓట్లున్నాయి.
ఇక హుజురాబాద్‌ నియోజకవర్గ ఉపఎన్నికలో అభ్యర్థుల విజయం ఓటర్ల చేతుల్లో ఉంది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దసరా పండుగకు మూడు రోజుల పాటు ప్రచారానికి విరామం ఇచ్చిన పార్టీలు.. ఇప్పుడు జోరు పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. నియోజకవర్గంలో ఓట్ల సంఖ్య పెరగడం, పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఓటర్లకు అవగాహన కల్పిస్తుండటం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓటింగ్‌ శాతం పెరిగితే లాభమెవరికి? నష్టమెవరికి? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: