పెగ్గు మీద పెగ్గేశారు.. బీరు మీద బీరేశారు..!

N.Hari
దసరా సందర్భంగా తెలంగాణ సర్కారుకు మందు బాబులు బీరు మీద బీరు కొట్టి.. పెగ్గు మీద పెగ్గు వేసి ఫుల్‌ కిక్కు ఇచ్చారు.  ఒక్క రోజే 201 కోట్ల విలువైన మద్యం..50 లక్షల విలువైన చికెన్, 13 లక్షల విలువైన మటన్ అమ్మకాలు జరిగాయి. దీంతో తెలంగాణ సర్కారుకు దసరా మస్తు కిక్కు ఇచ్చినట్లు అయింది. రాష్ట్ర ఖజానాకు లిక్కర్ సేల్స్ రూపంలో కాసుల వర్షం కురిసింది. మూడు రోజుల్లోనే  భారీగా అమ్మకాలు జరిగాయి. దీంతో సర్కార్ ఖజానాకు మస్తు ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో 2,216 వైన్‌షాపులు.. వెయ్యికి పైగా బార్లు ఉన్నాయి. మొత్తం 20 డిపోల నుంచి  మద్యం సరఫరా అవుతుంది. పండుగ కారణంగా ఈ నెల 13, 14, 16 తేదీల్లో ఏకంగా రూ. 504 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి వైన్‌ షాపులకు, బార్లకు సరఫరా అయింది. సాధారణంగా ఒక్క రోజు రూ. 70 కోట్లు నుంచి రూ. 80 కోట్లు వరకు మాత్రమే డిపోల నుంచి మద్యం లిఫ్ట్‌‌‌‌ చేస్తారు. దసరా కావడంతో ఇది రెండింతలు అయింది. ఈనెల 14న 178 కోట్లు.. 16న 169 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి తరలించారు. ఈ నెలలో ఇప్పటికే రూ.1500 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.16 వేల కోట్లకు పైగా విలువైన  లిక్కర్‌‌‌‌ అమ్ముడైంది.
తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో మూడేళ్ల  కిందటి దాకా  ఐఎంఎల్‌‌‌‌ సేల్స్‌‌‌‌ కంటే బీర్ల అమ్మకాలు డబుల్‌‌‌‌ ఉండేవి. ఆ తర్వాత  ఐఎంఎల్‌‌‌‌ కంటే బీర్ల సేల్స్‌‌‌‌ తగ్గిపోయాయి. కరోనా టైమ్లో బీర్ల వాడకం చాలా వరకు పడిపోయింది. మరోవైపు ఎక్సైజ్‌‌‌‌ శాఖ కూడా బీర్ల ధరలను పెంచింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయి. అయితే ఇటీవల కరోనా తగ్గడం, వ్యాక్సిన్‌‌‌‌ అందుబాటులోకి రావడంతో పాటు ఒక బీరు‌‌‌పై 10 రూపాయలు తగ్గించడంతో అనూహ్యంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు  కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. ఇందులో దసరా సందర్భంగా మూడు రోజుల్లోనే దాదాపు సగం వరకు అమ్మకాలు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ జిల్లాలో రూ. 103 కోట్లు విలువైన మద్యం సేల్స్  జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. 1,17,000 కేసుల ఐఎంఎల్‌‌, 1,23,000 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత నల్గొండలో రూ. 59 కోట్లు విలువైన మద్యం అమ్ముడైంది. హైదరాబాద్‌లో రూ. 43 కోట్లు, మెదక్‌లో రూ. 41 కోట్లు,  మహబూబ్‌‌నగర్‌లో రూ. 39 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తానికి ప్రభుత్వ ఖజానాకు దసరా మస్త్ మస్త్‌గా కిక్కు ఇచ్చిందని ఎక్సైజ్‌ శాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: