కౌశిక్ రెడ్డి కోసం కేసిఆర్ ఇంత త్యాగం చేస్తున్నారా..?

MOHAN BABU
పెద్దల సభకు కౌశిక్ రెడ్డిని పంపడం ఎలా..? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమెలా.? హుజురాబాద్ బై పోల్ లో ప్రతిపక్షాలకు అస్త్రంగా మారకుండా వెంటనే ఎమ్మెల్సీ ని చేయడం ఎలా? ఇవే ప్రశ్నలు గులాబీ బాస్ మదిని కొన్ని రోజుల నుంచి తొలిచేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచిస్తే ఐడియాలకు కొదవ ఉంటుందా అన్నట్లుగా కత్తిలాంటి ఐడియా ఒకటి ఫ్లాష్ అయిందట. కౌశిక్ రెడ్డి కోసం మరో ఆయుధాన్ని ప్రయోగించేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నారట. అదే కౌశిక్ లో ఆశలను సజీవంగా ఉంచుకుందట.

హుజురాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగుతున్న సమయంలో అందరి నోళ్లలోను నానుతున్న మరో అంశం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ వ్యవహారం. కౌశిక్ రెడ్డి  ఎమ్మెల్సీ ప్రతిపాదన గవర్నర్ కార్యాలయంలో పెండింగ్ లో ఉండడంతో మరింత చర్చనీయాంశమైంది. ఓరకంగా బీజేపీ,కాంగ్రెస్ లకు సైతం ఎన్నికల్లో ప్రచార ఆయుధంగా మారింది. కెసిఆర్ నమ్మించి గొంతు కోస్తారని, నమ్మకద్రోహం చేస్తారని అందుకు కౌశిక్ రెడ్డి కీ ఎమ్మెల్సీ ఇంకా రాకపోవడమే నిదర్శనమని ఈటెల రాజేందర్ తో పాటు రేవంత్ రెడ్డి కూడా ఘాటు విమర్శలు చేస్తున్నారు. అటు కౌశిక్ రెడ్డి లోను ఏదో మూలన కీడు  శంకిస్తోంది. దీంతో కేసీఆర్ పై ఒత్తిడి పెరుగుతోంది. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ అనేక వ్యూహాలకు పథకాలకు  సానపెట్టారు. అందులో ఒక అస్త్రం కౌశిక్ రెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కౌశిక్ రెడ్డి అభ్యర్థి అని ప్రచారం జరిగింది.ఇలాంటి పరిస్థితుల్లో కౌశిక్ ని కారెక్కించేసి ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. సమాజసేవకుల కోటాలో ప్రతిపాదించి ఆ ఫైల్ ని గవర్నర్ కు పంపారు. కానీ కౌశిక్ రెడ్డి ని సమాజ సేవకుల  కేటగిరిలో ఎమ్మెల్సీ గా ప్రమోట్ చేసేందుకు గవర్నర్కు కొంత అభ్యంతరం ఉన్నట్టు  ఉంది. దీంతో పూర్తి విచారణ చేసిన తర్వాత ఆమోదించేందుకు ఆ ఫైల్ ని పెండింగ్లో పెట్టారు. ఇంతలోపు ఎన్నికల డేట్ వచ్చేసింది. ఎటూ తేలక రాజ్ భవన్ లో ఫైల్ ఉండడంతో కెసిఆర్ కు ప్రెస్టేజ్ ఇష్యూ గా మారింది. తన మాట చెల్లుబాటు కాకపోవడం కొంత ఇబ్బంది చేస్తోంది. అందుకే కౌశిక్ రెడ్డి ని ఎలాగైనా ఎమ్మెల్సీ చేయాలని అనుకున్న గులాబీ బాస్ మరో ఆయుధాన్ని బయటకు తీసేందుకు ఆలోచిస్తున్నారు. కౌశిక్ రెడ్డి పై గవర్నర్ ఎటు తేల్చక పోవడం తో హైకోర్టును ఆశ్రయించాలని ఆలోచిస్తున్నారట  కెసిఆర్.

కోర్టు ద్వారా కౌశిక్ కి క్లియరెన్స్ ఇప్పించాలని  భావిస్తున్నారట. మహారాష్ట్రలోను  గతంలో ఇలాగే జరగడంతో అదే ఇష్యూ స్ఫూర్తిగా కోర్టు మెట్లు ఎక్కాలని డిసైడ్ అయ్యాడట. గవర్నర్ నిర్ణయం మరింత ఆలస్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో హైకోర్టులో పిటిషన్ వేస్తే ఎలా ఉంటుందని వేదోమదనం సాగిస్తున్నారు. ఈ ప్రయత్నం తప్పకుండా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు. నిరాశ,నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న కౌశిక్ రెడ్డి లోనూ ఇదే కొత్త ఆశలు చిగురించేలా చేస్తుందట. కౌశిక్ రెడ్డి కోసం కేసిఆర్ చేస్తున్న మరో గట్టి ప్రయత్నం  ఫలిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: