బీజేపీ జగన్ వైపు చూస్తే.. చంద్రబాబు ఏంచేయాలి..?

Deekshitha Reddy
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఈరోజు మిత్రపక్షం రేపు ప్రతిపక్షం కావచ్చు. ఈరోజు విమర్శలు చేసుకున్న పార్టీల నేతలిద్దరూ రేపు ఒకే పార్టీలో ఉండచ్చు. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పోటీచేస్తారనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఎవరెవరు పొత్తులు పెట్టుకుంటారో కూడా ఎవరికీ అర్ధం కానీ విషయం. కొన్ని సందర్భాల్లో పొత్తులు.. మరికొన్ని సందర్భాల్లో ఒంటరిగా పోటీచేయడం... ఇలా ఏపీలో రాజకీయ పార్టీల మధ్య విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.
రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలిసి పోటీచేయాలంటూ వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు సూచించారు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే.. ఎన్డీయేలో వైసీపీ చేరాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో చేరితే రాష్ట్ర ప్రయోజనాలన్నీ నెరవేరుతాయని కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హైవేల నిర్మాణంతో పాటూ.. నీటి పారుదల ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తవుతాయని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యను కూడా బీజేపీ సానుకూలంగా పరిష్కరించే అవకాశం ఉందని.. సలహా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వైసీపీ నేతల్లో ఆలోచన మొదలైంది.
ఒకవేళ నిజంగానే వైసీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది..? ఇప్పటికే బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఏమిటి..? ఆయన సొంతంగానే పోటీ చేస్తారా..? లేక ఎవరితోనైనా కలుస్తారా అనేది కూడా అంతుచిక్కని రహస్యమే. బీజేపీతో ప్యాచప్ చేసుకోవాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో.. చంద్రబాబు ఆశలపై అథవాలే నీళ్లు చల్లారని అనుకోవచ్చు. ఆయన మాట విని వైసీపీ, బీజేపీతో జట్టుకడుతుందని చెప్పలేం కానీ.. ఒకవేళ అదే జరిగితే బాబు పరిస్థితి ఏంటనేది అనుమానమే.
టీడీపీ సంగతి పక్కనపెడితే.. రాష్ట్రంలో బీజేపీతో ఇప్పటికే మిత్రపక్షంగా తిరుగుతున్న జనసేన సంగతి ఏమిటన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు మొదలవుతున్నాయి. జగన్, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. టీడీపీ, జనసేన కూడా ఒంటరిగానే బరిలోకి దిగాల్సిఉంటుంది. ఏదిఏమైనా కేంద్రమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: