పెట్రో ఎఫెక్ట్ : భద్రత లేని బతుకు మాకెందుకు?

RATNA KISHORE

మోడీ కానీ జ‌గ‌న్ కానీ చేయాల్సిందంతా చేసి ప్ర‌జ‌ల‌పై త‌మ‌కు ప్రేమ ఉంద‌నే చెబుతున్నారు. ప్రేమ ఉంటే ఏదో ఒక రీతిన పెట్రో, డీజిలు ధ‌ర‌లు త‌గ్గించవ‌చ్చు క‌దా అని మాత్రం అడ‌గ‌కండి. ఏదో చిన్నా చిత‌కా పనులు చేసుకుని బ‌తుకు బండి లాగించే వారికి ఇవాళ అస్స‌లు ఆ పాటి ప‌ని కూడా ద‌క్క‌డం లేదు. ఉపాధి లేదు. అయిన వారికి అన్నీ క‌ట్ట‌బెట్టే మోడీ  కానీ జ‌గ‌న్ కానీ ఇవాళ సామాన్యుల బాధ‌లు ప‌ట్టించుకునే తీరిక‌లో లేరు అన్న విమ‌ర్శ ఒక‌టి న‌డుస్తోంది. ఉచిత ప‌థ‌కాలు పేరిట జ‌గ‌న్ , ఛార్జీల వ‌డ్డ‌న పేరిట మోడీ, ధ‌ర‌ల బాదుడు వ‌దులుకోని  మ‌నిషిగా నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ ఆంధ్రాకు చేసిందేం లేదు. ఆ మాట‌కు వ‌స్తే మోడీ కానీ నిర్మ‌ల‌మ్మ కానీ దేశానికి కూడా చేసిందేం లేదు. కార్పొరేట్ శ‌క్తుల‌కు సాయం చేసి రాయితీలు ఇచ్చి వారికి, వారి బిడ్డ‌ల‌కు మాత్రం ఎంత లేద‌న్నా, ఎంత వ‌ద్ద‌న్నా, ఎవ్వ‌రు వారించినా చేస్తూనే ఉంటారు. వారి సేవే జ‌గ‌న్ కు మ‌రియూ మోడీకి అత్యంత ప్రాధాన్యాంశంగా మారిపోతుంద‌న్నది విప‌క్షం విమ‌ర్శ. ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై ఇప్ప‌టికీ ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఏం చేశారో చెప్ప‌లేక‌పోతున్నారంటే.. వీళ్ల ప్రమేయం లేకుండానే ఇవ‌న్నీ జ‌రిగిపోతున్నాయా ఏంటి? మౌనానికి అర్థం ఏంటి?

 
ధ‌ర‌లు నియంత్రించ‌లేని ప్ర‌భుత్వం మాకెందుకు.. ఓ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఉన్న‌ప‌ళాన దివాళా తీసేలా చేస్తున్న లేదా  చేసేందుకు సిద్ధం అవుతున్న ప్ర‌ధాని మాకెందుకు.. ఓ విధంగా దేశాన్ని అన్ని విధాలా అధోగ‌తిలోకి నెడుతున్న, అంధ‌కారంలోకి తీసుకుని వెళ్తున్న ప్ర‌ధాని మాకెందుకు.. అన్న ప్ర‌శ్న‌లు ఇవాళ సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి. ఇక కాయ‌గూర‌ల ధ‌ర‌లకు వ‌స్తే ఉల్లి  పాయ‌లు అర‌వై రూపాయ‌లు, ట‌మోటా ధ‌ర అర‌వై రూపాయ‌లు, ఇంకా ఇత‌ర కూర‌గాయల ధ‌ర‌లు అలానే ఉన్నా ఇందుకు తాను కార‌ణం కాదంటాడు మోడీ. ప్ర‌పంచమే ఆర్థిక సంక్షోభంలో ఉంటే తానేం చేయ‌గ‌ల‌ను అని చేతులెత్తేస్తాడు మోడీ. గ్యాస్ సిలిండ‌ర్ పై ఒక‌ప్పుడు స‌బ్సిడీ చెప్పుకోద‌గ్గ రీతిలోనే ఉండేది. ముందు స్థోమ‌త ఉన్నవారు స‌బ్సిడీ వ‌దులుకోండి అని చెప్పి ఆ త‌రువాత తానే మొత్తం రాయితీనే తొల‌గించి చోద్యం చూస్తున్నాడు.

 ఇప్పుడు గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర్ వెయ్యి రూపాయ‌లు దాటి పోయింది. క‌మ‌ర్షియ ల్ సిలిండర్ కొందామ‌న్నా మార్కెట్ లో కొంద‌రికి దొర‌క‌డం లేదు. దొరికినా ధ‌ర‌లు చూసి వ్యాపారుల‌కు చుక్కలు క‌నిపిస్తున్నాయి.ఇంత జ‌రిగినా ఏ ఒక్క వ‌స్తువు ధర కూడా నేల చూపులు చూడ‌దు. ఇదే స‌మ‌యంలో క‌రోనా సాకుతో పెంచేసిన ధ‌ర‌లు కొన్ని, లాక్డౌన్ సాకుతో పెంచేసిన ధ‌ర‌లు ఇంకొన్ని. ఇవ‌న్నీ ఒక‌లా ఉంటే కాస్తో కూస్తో ప‌రిశ్ర‌మ‌లు ప‌నిచేస్తున్నాయంటే వాటిపై విద్యుత్ ఛార్జీల బాదుడుకు రాష్ట్రం సిద్ధం అవుతోంది. విద్యుత్ , గ్యాస్ విష‌య‌మై కేంద్రం మ‌న రాష్ట్రం కు చేసే సాయం ఏమీ లేక‌పోయినా, లేద‌న్న సంగ‌తి తేలిపోయినా జ‌గ‌న్ మాత్రం మోడీకి మ‌ద్ద‌తు ఇస్తూనే ఉంటాడు. ఇన్ని అభ‌ద్ర‌త‌ల‌ను ఇవాళ సామాన్యుడు మోస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: