కరెంటు కోతలపై తప్పుడు ప్రచారం సాధ్యమేనా..?

Deekshitha Reddy
కరెంటు కోతలపై ఏపీలో తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీని అంధకారంలోకి నెట్టేస్తున్నారంటూ.. లోకేష్ సహా ఇతర ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అసలు ఈ రెండిటిలో ఏది నిజం..? ఎంత నిజం..?
కోతలు నిజమా..? కాదా..?
బొగ్గు కొరతతో కరెంటు ఉత్పత్తి తగ్గిపోతోందని, పొదుపుగా విద్యుత్ ని ఖర్చు చేయాలంటూ ఇటీవల ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీక్ టైమ్ లో ఎక్కువ రేటు పెట్టి కరెంటుని కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందుకే ఏసీ లాంటి ఉపకరణాల వాడకంలో కాస్త నియంత్రణ అవసరమని సూచించారు. మరోవైపు మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా కరెంటు కష్టాలు ఉన్నాయి కానీ అధిగమిస్తామని అంటున్నారు. అయితే ఈ మధ్యలో ప్రతిపక్షం మాత్రం భవిష్యత్ లో ఏపీ అంధకారంలోకి వెళ్లబోతోందంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీంతో ప్రభుత్వం కౌంటర్లు ఇవ్వడానికి అవస్థలు పడుతోంది.
ప్రస్తుతానికి పల్లెటూళ్లలో అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. అయితే అధికారికంగా ఎక్కడా ఇంకా విద్యుత్ కోతలు మొదలు కాలేదు. సమస్య తీవ్రత ఇంకా పెద్దది కాలేదు. కానీ కరెంటు కష్టాలు ఉండేందుకు అవకాశముందని మాత్రం తెలుస్తోంది. ఏపీయే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరెంటు కష్టాలు మొదలు కాబోతున్నాయి, కొన్ని చోట్ల మొదలయ్యాయి కూడా. కరెంటు ఉందా లేదా అనే విషయాన్ని ఎవరూ దాచిపెట్టలేరు. ప్రతిపక్షాలు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు కరెంటు కోతల విషయంలో భయపడే పరిస్థితి లేదు. ఒకవేళ భవిష్యత్తులో నిజంగానే కోతలు పెరిగితే.. కచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి సంగతేమో కానీ.. ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శల ఒత్తిడి మాత్రం వైసీపీ నేతలపై ఎక్కువవుతోందని తెలుస్తోంది. అందుకే కోతల్లేవు, కోతలున్నాయని తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసినా, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల కరెంటు కష్టాలు లేకుండా ఉంటే అదే పదివేలు. ఆమధ్య రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో కూడా ఇలాగే అనవసరంగా భుజాలు తడుముకున్నారు వైసీపీ నేతలు. జనసేన ఉద్యమం మొదలు పెట్టే సరికి హడావిడిగా కొన్నిచోట్ల పనులు పూర్తి చేశారు. ఇప్పుడు కరెంటు కోతలపై ప్రతిపక్షాల విమర్శలను కాచుకునేందుకు హడావిడి పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: