విష్ణు ప్రమాణస్వీకారానికి చిరు గైర్హాజరు అందుకేనా?

N.Hari
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ - 'మా' ఎన్నికలు గతంలో ఎన్నడా లేని విధంగా వాడివేడిగా జరిగాయి. ఎన్నికలు మొదలు అయినప్పటి నుంచి ముగిసివరకు చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలు, ఘటనలు రచ్చకు ఎక్కాయి. మా అధ్యక్ష పీఠం కోసం సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యువ హీరో మంచు విష్ణు నువ్వా- నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు అంతేకాకుండా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలోనే జరిగింది. ముఖ్యంగా స్థానికత, వ్యక్తిగత అంశాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. ఇక నామినేషన్ల సమయంలో అయితే పోటాపోటీగా ర్యాలీలు సైతం చేశారు అలాగే పోలింగ్ రోజున దాడులు. గొడవలు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తం మీద రాజకీయ ఎన్నికలను తలపించేలా జరిగిన 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు.
మా ఎన్నికలు ముగిసిన తర్వాత తామంతా ఒకే కుటుంబానికి చెందినవారమని పరిశ్రమ పెద్దలు పలువురు చెప్పారు. ముఖ్యంగా చిరంజీవి ఈ విషయాన్ని చెప్పడంతో ఇంతటితో ఈ అనవసర రాద్దాంతానికి, రచ్చకు తెర పడినట్లేనని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత కొందరు... ముఖ్యంగా నాగబాబు వంటివారు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం మళ్లీ వేడిని రాజేసింది. నాగబాబు ప్రకటన తర్వాత ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాష్ రాజ్ ప్యానెల్‌ సభ్యులు కూడా తమ పదవులకు రిజైన్‌ చేస్తున్నామని అని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చారు. అయితే ఈ ప్రకటనలపై మంచు విష్ణు అంతగా స్పందించలేదు. తన ప్రమాణ స్వీకారోత్సవంపై ఆయన ఫోకస్‌ చేశాడు. ఇందులో భాగంగా ఇండస్ట్రీ పెద్దలను కలిసి ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు నందమూరి బాలకృష్ణ ఇంటికి మోహన్ బాబు, మంచు విష్ణులు వెళ్లి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నట్లు మీడియా అడిగిన ఈ ప్రశ్నకు మంచు విష్ణు సమాధానం ఇచ్చారు.
అయితే శనివారం జరిగిన మా ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ చిరంజీవిని మోహన్ బాబు, మంచు విష్ణులు  ఆహ్వానించారా? లేదా? ఒకవేళ వారు ఆహ్వానించిన ప్పటికీ చిరంజీవి వెళ్లలేదా? ఆయన హాజరు కాకపోవడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న చర్చ జోరుగా సాగింది. దీనిపై ఆరా తీయగా.. చిరంజీవి అనారోగ్య కారణంతో ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని తెలుస్తోంది. మొత్తంమీద మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన తండ్రి మోహన్ బాబు తప్ప... సినీ పరిశ్రమ పెద్దలు ఎవరు పెద్దగా కనిపించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: