పీఆర్సీపై ఏపీ ఉద్యోగుల్లో ఆందోళన!

N.Hari
ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ కింద ఎంత మేరకు వేతనాల పెంచాలనే దానిపై అధ్యయనం చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అశుతోష్‌ మిశ్రా.. తమ నివేదికను కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలోనే ప్రభుత్వానికి అందజేశారు. అయితే మిశ్రా నివేదికను ప్రభుత్వం నేటి వరకు బహిర్గతం చేయలేదు. దీంతో పీఆర్సీపై ఏపీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వేతన సవరణ కమీషన్‌ను.. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన స్కేళ్లను పెంచేందుకు ఫిట్‌మెంట్‌ను లెక్కగట్టి సిఫార్స్‌ చేస్తుంది. 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే సరిపోతుందని మిశ్రా కమిటీ సిఫార్సు చేసినట్టు తెలిసింది. అయితే ఏపీ ప్రభుత్వం 2019 జులై నుంచి 7 శాతం పెంచి... 27 శాతం మధ్యంతర భృతిని అందిస్తోంది.
మరోవైపు ఉద్యోగులు మాత్రం కనీసం 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చింది. అప్పట్లో రెవెన్యూ లోటు అధికంగా ఉన్నప్పటికీ చంద్రబాబు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌ 27 శాతానికి తోడు మరో 3 శాతం పెంచి మమ అనిపించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం గ్రాట్యుటీ కింద రూ. 12 లక్షలు మాత్రమే ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ. 20 లక్షలుగా  చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పీఆర్సీ సిఫార్సుల ఆమోదం అనంతరం గ్రాట్యుటీని రూ. 18 లక్షలకు పెంచింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పీఆర్సీ అమలు చేసిన సమయంలో 10 నెలలు అరియర్స్‌ ఇచ్చారు. ఈసారి అలా ఇస్తారా? లేదా? అనేది కూడా సందేహంగా మారింది. పీఆర్సీ ఉద్యోగులకు 30శాతం ఇచ్చినప్పటికీ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచవలసి వస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వంపై మొత్తంగా నెలకు అదనంగా రూ. 400 కోట్లు భారం పడే అవకాశం ఉంది. తాము ఇప్పటికే 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరామని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ చెబుతోంది. అయితే పీఆర్సీ సిఫార్సుల్లో ఎంత ఇస్తామమనేది ఈ నెలాఖరకు ఖరారు చేస్తామని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
అశుతోష్‌ మిశ్రా సిఫార్సుల మేరకు 27 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న ప్రతిపాదనలను ఉన్నతాధికారులు సమర్థించారు. ఏపీ ఉద్యోగులకు తెలంగాణ మాదిరిగా.. 30 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించి, పీఆర్సీ వివాదానికి ముగింపు పలకాలని సర్కారు ప్రయత్నిస్తుంది. ఇదే జరిగితే ఏపీ ఉద్యోగులు మాత్రం మరోసారి ఆందోళన బాటపట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: