ఓకే.. కానీ.. తెలంగాణ జీవో ఇస్తేనే.. ఏపీ మెలిక..?

Chakravarthi Kalyan
కృష్ణా, గోదావరి నదుల నిర్వహణపై కొన్నాళ్ల క్రితం గెజిట్ విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు దాని అమలు కోసం ప్రయత్నిస్తోంది. వాస్తవానికి నిన్నటి నుంచే గెజిట్ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ.. తెలంగాణ సర్కారు ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో  గెజిట్ అమల్లోకి వచ్చినట్టు భావించలేం.. ఏపీ, తెలంగాణ రెండు ప్రభుత్వాలు తమ ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తూ జీవోలు ఇస్తేనే గెజిట్ అమల్లోకి వచ్చినట్టు లెక్క.

అయితే.. ప్రాజెక్టులను అప్పగించేందుకు అంత సుముఖంగా లేని తెలంగాణ.. ఈ అంశంపై మరింత ఆలోచించాలని తలుస్తోంది. అందుకే దీనిపై ఓ మంత్రివర్గ ఉప సంఘం వేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చాక జీవో పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే అటు ఏపీ మాత్రం.. కృష్ణా నదిపై ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్ కు అనుగుణంగా జీవో ఇచ్చింది. ఏపీలోని ప్రాజెక్టులను అప్పగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు మినహా నాలుగు  కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు ఈరోజు నుంచే అప్పగిస్తున్నట్లు  జీవోలో పేర్కొంది.

అంతే కాదు.. నోటిఫికేషన్ లోని రెండో షెడ్యూలు ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే, రివర్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు , హంద్రినీవా, ముచ్చుమర్రి లను  కూడా అప్పగిస్తున్నట్టు  జీవోలో చెప్పింది. అయితే ఇక్కడే ఏపీ ఓ మెలిక పెట్టింది. తెలంగాణ కూడా ప్రాజెక్టులను స్వాధీనం చేస్తేనే తాము కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తామని తన జీవోల్లో స్పష్టం చేసింది. ప్రాజెక్టుల్లోని భవనాలు., ఇతర కట్టడాలు, యంత్ర సామాగ్రిని ఎక్కడివక్కడ ప్రాతిపదికన అప్పగిస్తున్నట్టు  ఏపీ తన జీవోలో తెలిపింది.

శ్రీశైలం ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ  బోర్డు పరిధిలోకే వస్తారని ఏపీ తన జీవోలో పేర్కొంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన రెవెన్యూను.. మునుపటిలాగే రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుందని ఏపీ తన జీవోలో  చెప్పింది. శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుపై కూడా నిర్ణయం తీసుకోవాలని ఏపీ కృష్ణా బోర్డును  కోరింది. మరి ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తుందన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: