హుజురాబాద్‌లో హాలీడే మూడ్‌!

N.Hari
సాధారణంగా దసరా సెలవులు ఉద్యోగులకు, విద్యార్థులకు వస్తుంటాయి. కానీ హుజురాబాద్‌లో రాజకీయ నేతలకు కూడా పండుగ సెలవులు వచ్చాయి. పండుగ కోసం నేతలు.. తమతమ బాస్‌ల అనుమతి తీసుకుని సొంతూళ్లకు వెళ్లారు నేతలు. నాలుగైదు నెలలుగా తీరిక లేకుండా ఉన్న లీడర్‌లు అందరూ.. హుజురాబాద్‌లో ఉపఎన్నిక ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టి ఊర్లకు వెళ్లారు. దీంతో మూడు రోజులు హుజురాబాద్‌లో మైకుల మోత, భారీ కాన్వాయ్‌ల హంగామా, రణగొణ ద్వనులతో ప్రచారం చేసే రథాలు, ర్యాలీలు, రోడ్‌ షోలు వంటివి వాటికి బ్రేక్‌ పడిందన్న చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజురాబాద్‌ ఉపఎన్నిక అనివార్యంగా మారింది. ఈటల రాజేందర్‌కు పట్టు ఉన్న హుజురాబాద్‌లో గెలవాలంటే.. అంత సులభం కాదని అధికార టీఆర్ఎస్‌ భావించింది. అందుకే తమ పార్టీ నేతలను అక్కడ మోహరించింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నేతలంతా ఐదు నెలలుగా హుజురాబాద్‌లోనే మకాం పెట్టారు. వాళ్లకు అప్పగించిన బాధ్యతల ప్రకారం ప్రచారం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఐదు నెలలుగా విరామం లేకుండా, కనీసం ఒక్కసారి కూడా సొంతూళ్లకు వెళ్లకుండా హుజురాబాద్ లోనే ఉండిపోయారు. సరిహద్దు దాటితే గులాబీ బాస్ నుంచి క్షణాల్లో ఫోన్‌లు వస్తాయన్న భయంతో.. కక్కలేక మింగలేక హుజురాబాద్ లోనే ఉండిపోయారు. మధ్యలో అసెంబ్లీ సమావేశాలకు కూడా  మంత్రులు, ఎమ్మెల్యేలు అలా వెళ్లి ఇలా వచ్చారు. ఉప ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ల పని తీరుపై టీఆర్ఎస్ భవన్ లో నిరంతరం మానిటరింగ్ ఉండటంతో చెప్పిన పని చేయడం తప్ప ఇంకో చోటుకు వెళ్లలేకపోయారు. ఇక వెళ్లినా తిరిగి గంటలోపే మండలంలో వాలిపోయారు. ఇలా ఐదు నెలలుగా కొనసాగుతున్న వారి ముఖాల్లో.. తెలంగాణ సంప్రదాయ వేడుక బతుకమ్మ, దసరా పండుగ కొంత ఆనందం కలిగించింది. పెద్ద సారు పర్మిషన్ తీసుకుని ఓ మూడు రోజులు పండుగ కోసం నేతలంతా ఊరెళ్లారు. వాళ్లతో ఉన్న అనుచర గణం కూడా సొంతూర్లకు వెళ్లిపోయింది.
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వెంట ఆయన సతీమణి, స్థానిక నాయకులు మాత్రమే ఉన్నారు. కొద్ది రోజులుగా వారే ప్రచారం నిర్వహించుకుంటున్నారు. బీజేపీ ముఖ్య, సీనియర్‌ నాయకులెవరు పెద్దగా హుజురాబాద్‌కు రాలేదు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ఇటీవల రెండు రోజులు ప్రచారం చేసి వెళ్లిపోయారు. ఈటల రాజేందర్ నామినేషన్ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అలా వచ్చి ఇలా వెళ్లారు. వీరందరూ కూడా ఈ నెల 17 నుంచి హుజురాబాద్‌లో విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,  పొన్నం ప్రభాకర్ మినహా ఎవరూ ప్రచారంలో పాల్గొనలేదు. నామినేషన్ల చివరి రోజు మాత్రం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి లాంటి అగ్రనేతలు హాజరై ఓ సభలో ప్రసంగించి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న నేతలందరికీ దసరా సెలవులు వచ్చాయన్న చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: